పుట:Ganapati (novel).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

గ ణ ప తి

వచ్చినవాఁడు పదియేండ్లవాఁడో యైదేండ్లవాఁడో యను కొని “అయ్యో నాయనా! పిల్లవానికి పట్టెడు చలిదియన్నము బెట్టమా? అదిగో చద్దివణ్ణాలగది, పెట్టుగుని తినుమనుఁడు. లేదా మీరు పెట్టవచ్చు” నని యా గదిఁ జూపిరి. ఆజానుబాహుఁడైన తన కుమారునిఁ జూచినపక్షమున వారు చలిది యన్నముఁ బెట్టరేమో యను భయమున నతఁడు మొదట వానిని వీధిలోనెయుంచి వెళ్ళి గదిచూచి వచ్చిన తరువాత నింటిలోని యాడువాండ్రు పనుల సందడి నున్నప్పుడు దొడ్డి దారిని తన బిడ్డనుఁ దీసికొనిపోయి యా గదిలోఁ బ్రవేశపెట్టి యన్నము బెట్టుకొని తినుమని చెప్పెను. ఆ గదిలో మానెడు బియ్యపన్న ముండెను. దానికి సరిపడిన యూరుగాయలు పచ్చళ్ళు నుండెను. తవ్వెడు గేదె పెరుగుండెను. రమారమి గిద్దెడు పేరిన నేయి యుండెను. పాపయ్య యాయన్నమంతయు వడ్డించుకొని యూరుగాయలు పచ్చళ్ళు నేయి పెరుగు మిగులకుండ సుష్టుగాఁ దిని యెప్పటియట్ల దొడ్డిదారిని వెలుపలకు వచ్చెను. భోజనము సమాప్తమైన తరువాతఁ దండ్రి యా యింటి యాఁడువాండ్రకడకుఁ బోయి “అమ్మా! మీ దయవలన మా వాఁడు చలిది యన్నము దిన్నాఁడు. నేను సెలవు పుచ్చుకొని వెళ్ళుచున్నా” నని చెప్పి వెళ్ళి పోయెను. ఆ యింట నైదారుగురు చిన్నబిడ్డలుండిరి. ఆ బిడ్డలందఱకు సరిపోవునని వారా యన్న మక్కడ దాచిరి. పాపయ్య తిని వెళ్ళిన గడియ సేపటి కా యిల్లాలు చలిది