పుట:Ganapati (novel).pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

353

నుండియు దలంచెను. కాని భగవంతుడు కావేరీతీరమె యామె నిమిత్తము విధించి యుండెను. ఇప్పటివలె నా కాలమున రైలు బండి లేకపోవుటచే రామేశ్వరయాత్ర నేటివలె సులభముగాక మిక్కిలి కష్టసాధ్యమై యుండుటచే సింగమ్మ మరణవార్త గణపతికి తెలియనే లెదు. మహాదేవశాస్త్రులుగారి తల్లి వచ్చి యావార్త చెప్పునప్పటికి గణపతి వానపల్లి విడిచిపోయెను. అందుచేత నతఁడు దల్లినిమిత్తము కన్నీరు గాని నువ్వులనీరు గాని విడువవలసిన యవసరము లేకపోయెను. బ్రతికియుండగా బెట్టిన పిండమే గాని చచ్చిన తరువాత పిండము పెట్టనవసరము లేకపోయెను. మాతా పుత్రులు వియోగమైనది మొదలుకొని గణపతి కొంతకాలము విద్యార్థుల యిండ్లలో వారములు చేసికొనియు, గొన్నినాళ్ళు వంటచేసి కొనియు, బ్రాహ్మణార్థములకు బోయియు, సంతర్పణముల కరిగియు గాలక్షేపము సేయజొచ్చెను. గాని వివాహము కాలేదని గొప్ప విషాద మతని మనస్సును విడిచిపెట్టలేదు. అంతకు ముందు చేసిన ప్రయత్నమువలన శుల్కము గ్రహింపకుండ దనకు కన్యాదానము చేయువా రెవ్వరు లేరని యతఁడు తెలిసికొని కొన్ని వందల రూపాయ లోలి దా నిచ్చి యైన వివాహ మాడవలయు నని నిశ్చయించుకొనెను. కాని ద్రవ్యము లేదు. అందునిమిత్తమై చందాలు సేయు మని గ్రామవాసులను బీడింపఁ జొచ్చెను. ఆ గ్రామవాసులనే గాక చుట్టుప్రక్కల నున్న గ్రామముల కరిగి తద్గ్రామీణులను