పుట:Ganapati (novel).pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

354

గ ణ ప తి

గూడ యాచింపజొచ్చెను. యాచించి తెచ్చిన సొమ్ము తన దగ్గర నుంచుకొనక తనకు నమ్మకముగల యొక బ్రాహ్మణుని చేతికిచ్చి దాఁచెను. రమారమి నూటయేబది రూపాయలు ప్రోగుపడెను. ఏడెనిమిది వందల రూపాయ లుండినగాని యతనికి వివాహము కాదు. ఎట్లయిన నంతసొమ్ము ప్రోగుచేసి యతడు కృతకృత్యుఁడు కావలెనను యత్నము చేయజొచ్చెను.

ఇట్లుండ నొకనాఁడు మహాదేవశాస్త్రి వర్తమాన మంపి గణపతిని పిలిపించి తన యెదుట గడ్డము పెంచుకొని యున్న యొకానొక బ్రాహ్మణుని జూపి యిట్లనియె. "అబ్బాయీ గణపతీ! ఈ బ్రాహ్మణుఁడు నీకు పిల్ల నియ్యవలెనని వచ్చినాఁడు. ఈయన కాపుర మంతర్వేది. వీరింటిపేరు చింతావారు. ఈయన పేరు భైరవదీక్షితులుగారు. ఈయన స్వాధ్యాయమందు గొప్ప యధికారి. ఈయనయే కాదు, ఈయన తండ్రిగారు, తాతగారు గూడ నెనుబదిరెండు పన్నములు గట్టిగా వల్లించి ఘనాపాఠులైనారు. వారు నీ వంటి వానితో సంబంధము చేయుటే కష్టము. ఇలాటిది నీ పూర్వ పుణ్యముచేత నీకు వారితో సంబంధము గలుగుచున్నది. ఈయన వందలు వేలు పుచ్చుకునేవాఁడు కాఁడు. నలువది వరహాలు మాత్రము నీ విచ్చేపక్షమున పిల్ల నీ యధీనమగును. పిల్లను నేను చూచినాను. గజ్జెలగుఱ్ఱములా గున్నది. ఆరు మాసములలోనే కాపురమునకు రాఁ గలదు.