పుట:Ganapati (novel).pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

320

గ ణ ప తి

పల్లి గాదట్రా! ఎఱుగనివానివలె నడిగెదవే?' మని ప్రత్యుత్తరము చెప్పెను. అప్పుడు సభాసదుల యానంద మేమి చెప్పుదును? చప్పట్లతో దెసలు మారుమ్రోగెను. హాస్యగాఁడు కడచిన రాత్రి పన్నిన పన్నుగడయె మరల పన్నదలచి 'యెవరో మరల దెబ్బ గొట్టినారు. మహాప్రభో!' యని చెప్పెను. కాని యా పలుకులు ప్రేక్షకులకు నమ్మదగి యుండలేదు. నిష్కారణముగ భాగవతము చెడిపోయిన దని సభాసదులు విచారించిరి. గరుడాచలము సిగ్గుపడియెను. అందరు గృహముల కరిగిరి. గరుడాచలమునకు గణపతి యొక్క వేషభాషలు కొంతకాలమునుండి యేవ గలిగించుచు వచ్చినను గథాకలాపము వినిపించుటలో నతని కేమయిన ప్రజ్ఞయుండునేమో యని యామె యాసపడెను. కాన యదిగూడ వట్టిదైనతోడనే తన కొలువులోనుండి లేచిపొమ్మని గణపతితో జెప్పెను. ఇకమీద మిక్కిలి జాగ్రత్తతో బని చేయుదునని గణపతి యామెను బహువిధముల బ్రతిమాలెను. కాని వాని కోరిక నామె నిరాకరించెను. అటమీద నే వృత్తి యవలంబింపవలయు నని గణపతి తన మిత్రులతో నాలోచింప నెక్కడయినను వంటబ్రాహ్మణుఁడుగ గుదిరినపక్షమున చక్కగా జీవనము జరుగునని కొందరు మిత్రు లుపదేశించిరి. ఆ వృత్తి యతని కంతగా నిష్టము లేకపోయినను విధిలేక యతఁ డొడంబడ వలసి వచ్చెను. గరుడాచలము దగ్గర నున్నపుడు తల కగరు నూనె సంపెంగనూనె రాచికొనుచు నది తీసి పాఱవైచిన