పుట:Ganapati (novel).pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

321

పూలదండలు చేతులకు మెడకు తగిలించుకొని యానందించుచు దాని మగడ నని చెప్పికొనుచు గడపిన దినములే తన జన్మమధ్యమున శ్రేష్టమైన దినములుగాఁ దలంచి పూర్వజన్మ దుష్క్రుత విశేషమున నట్టి యఖండయోగము తనకు దప్పిపోయిన దని విచారించుచు నొక లోకలఫండు యినస్పెక్టరు గారి యింట వంట బ్రాహ్మణుడుఁగ గుదిరెను. అన్నము పెట్టి నెలకు నాలుగు రూపాయలిచ్చుటకు వారొడంబడిరి. కాని పదునైదు దినములు ముందుగా దన యాడువాండ్రదగ్గఱ వంట నేర్చికొమ్మని యా యధికారి గణపతితో జెప్పెను. అట్లే యని గణపతి యాయన తల్లియు బార్యయు వంట చేయునపుడు దగ్గఱ కూర్చుండి వంట చేయువిధము కనిపెట్ట జొచ్చెను. ఇట్లొక మాసము గతించిన తరువాత యజమానుడు గణపతిని దీసికొని యొక గ్రామము వెళ్ళి యుద్యోగస్థుల నిమిత్త మేర్పడిన యొక బంగాళాలో దిగెను. వంట కుపయోగించు పాత్రములను దెచ్చుకొమ్మని యజమానుఁడు పలుమాఱు జెప్పెను. కాని మందమతులలో నగ్రగణ్యుఁడైన గణపతి గరిటెలు మఱిచిపోయెను. ఒక్కొక్క మనుష్యున కెన్ని బియ్యము పోయవలెనో యతఁ డెఱుఁగడు. ఏ గిన్నె యెంత యుడుకునో తెలియక మానెడు బియ్య ముడుకు గిన్నెలో, భోజనము చేయవలసినవారు తమ రిద్దఱైనప్పటికి వడ్డెడు బియ్యముబోసి పాక మారంభించెను. అన్నము గిన్నెలో నొక్కటే ముద్దయైపోయెను. కలియబెట్టుటకు గరిటె