పుట:Ganapati (novel).pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

317

జడవైచి దానిని మిక్కిలి సొగసుగా వర్ణించుచుండ, తహసీలుదారు జరుగుచున్న యాలస్య మోర్వక "యేమిటది, గేదెతోఁక లాగున జడ తెరమీఁదవైచి లోపల కూర్చుండి యేదో గింజుకొనుచున్న దేమిటి? ఎవరోయి బంట్రోతు! జడ బట్టుకొని లాగి యీవల కీడ్చుకొని రావోయి!" యని కేక వైచెను. గరుడాచలము సహజముగ గర్వోన్మత్తురాలు. ప్రశస్తమైన కంఠమును భామవేషధారణ ప్రవీణతయు గర్వమును హెచ్చించెను. తహసీలుదారుగా రాడిన పలుకుములుకు లామెకు దుస్సహములై ప్రత్యుత్తర మీదలచినను నటువంటి మహాధికారిని యెదిరించుట స్వనాశనముకు దారి జేసికొనుట యని గుర్తెఱిఁగి బంట్రోతీడ్చికొని రానక్కఱలేకయె జడవర్ణనము ముగించి తెఱవెడలి వచ్చెను. గరుడాచలము తన్నుంచుకొన్న రసికుల ప్రేరణముననో వారికి గుతూహలము గల్పింపవలె నను సంతసము చేతనో చిన్న నాఁడు తల్లి చేసిన యలవాటు చేతనో మనస్సున కుత్సాహము గలుగునను తలంపు చేతనో వేసవికాలమందు కల్లును, తక్కిన కాలములందు సారాయియుఁ ద్రాగుచుండును. భామవేషము కట్టినప్పుడు చాకచక్యము హెచ్చుటకై యామె తప్పక కొంచెము పుచ్చుకొని వచ్చును. ఆనాఁడు మోతాదు కొంచె మెక్కు వయ్యెను. సగము కలాపము వినిపించు నప్పటికి మత్తు సంపూర్ణముగ నెక్కుటచే నామె తప్ప తప్ప మాటలాడుచు నేలమీఁద బడెను. హాస్య