పుట:Ganapati (novel).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

గ ణ ప తి

దేవుడుగారి యింట్లో యిత్తడి సిబ్బె. ఈ విధముగ గణపతి యనేక శాస్త్రములలో బ్రవేశము గలిగి తాను నేర్చిన విద్య యొరులకు నేర్పనివాఁడు ముందు జన్మమున ముషిణిచెట్టయి పుట్టునని పెద్దల నోటినుంచి వెడలు వాక్యములు పలుమారు విని యుండుటచే నట్టి విషపు చెట్టయి పుట్టుట కిష్టములేక తన కడుపులోనున్న జ్ఞాన మంతయు నిప్పు డప్పు డనక ప్రసంగము వచ్చినపుడు తన విద్యార్థులకు, గ్రామవాసులకు జెప్పుచుండును. సర్పములను గురించియు సర్పస్వభావచేష్టితములను గురించియు నాతనికిఁ దెలిసిన జ్ఞానము లోకోపకారముగ నుండును. కావున గ్రంథ విస్తరతకైనను నొడంబడి నవ్విషయ మందలి ముఖ్యాంశము లిందు బొందుపఱుపఁ బడుచున్నవి.

"పాము దీర్ఘ క్రోధముగల జంతువు. దాని జోలికి పోయిన మనుష్యునిపై నది కసిపట్టి పగ పూని యుండును. పాము కసి, పాము పగ యని మీరు వినలేదా? తన జోలికి వచ్చినవాడు వెంటనే దొరకిన యెడల వానిని వెంటనే కరిచి చంపును. వాఁడు దొరికినప్పుడే దాని సొగసు, దాని తమాషా ! వాఁడు దొరకనప్పుడు పాము పగబట్టి వాఁ డెన్ని మేడలమీఁద బండుకొన్నప్పటికి, యెన్ని మిద్దెలమీఁద దాఁగొన్నప్పటికి, ఎంతమందిలో నిద్రపోయినప్పటికి రాత్రివేళ వెళ్ళి వానిని పట్టి కరిచి చంపును. ఏలాగో తెలుసా? ఎవరిమీద పాము పగపట్టునో వాని యడుగు లనఁగా వాడు నడిచిన