Jump to content

పుట:Ganapati (novel).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

గ ణ ప తి

నెంత వాడను. తమ దయచేత నాలా గనుచున్నారు. కాని నేనంత పండితుఁడను కానండి. ఆ సరస్వతీదేవి దయవల్ల నాకు నాలుగు ముక్కలు వచ్చినవి, కాని నేను పట్టుమని శాస్త్రములు చదువుకోలేదండీ !" యని బదులు చెప్పెను. పై పద్యముయొక్క యర్థమును బట్టి గణపతి యెంత ప్రజ్ఞాశాలియై వానికడ నెటువంటి విచిత్రభావము లున్నవో, యెంత సమయస్ఫూర్తి యున్నదో సరసులు నిష్పక్షపాత మనస్కులు నగువారందరు గ్రహింపవచ్చును. వ్యాకరణ శాస్త్రమొ, తర్కశాస్త్రమొ, చదువుకొని శబ్దమున కపార్థము కల్పించి నిజ మబద్ధ మని, యబద్ధము నిజ మని కల్ల వాదములు సేయు పండితులను జూచి జనులు జోహారులు చేసి వారి చెవులకు సువర్ణ కుండలములు తగిలించి శాలువలు కప్పి యఖండ సన్మానము చేయుదురు. కాని గణపతి 'శ్రీరఘురామ ' యన్న పద్యమునకు స్వకపోలకల్పితముగ నత్యంతరమణీయమైన యర్థము చెప్పినపు డా గౌరవము జూపుటలేదు. సరికదా మీదు మిక్కిలి యపహాస్యము చేయుదురు. ఇవి మెత్తని వారికి దినములు కావుగదా!

పూర్వోదాహృత పద్యార్థమును బట్టి యతని యాంధ్రసాహిత్య ప్రభావము తేటపడినది. సాహిత్యమునందే గాక యతనికి శారీరశాస్త్రము నందును మరికొన్ని యితరవిషయములందును గల ప్రవేశము దెలుపుటకై కొన్ని మాటలు చెప్పుట అవశ్య కర్తవ్యము. ఎవఁడో పిల్లవాఁడు జ్వరముచేత బాధపడు