పుట:Ganapati (novel).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

231

సారు లుంకించెను. కాని బదులు చెప్పినచో మేనమామ బుఱ్ఱ వంగఁదీసి చావగొట్టు నని భయపడి నోరెత్తక "అమ్మా ! రావే; అతఁ డింటిలో క్షణ ముండఁగూడ దని, యతఁ డను చున్నప్పుడు సిగ్గులేక మన ముండఁగూడదు. అన్నము లేకపోతే నాలుగూళ్ళు ముష్టెత్తుకు తినవచ్చును, రా. మాటలు మనము పడఁగూడదు లే!" యని చేయి బట్టుకుని లేవఁదీసి తీసికొని పోయెను. ఆమె గొల్లుమని యేడ్చుచు వీధిలోనికిఁ బోయి "దేముడా, దేముడా ! నా తోడబుట్టినవాడు చచ్చిపోయినాడమ్మా ! నా పుట్టింటికి నాకు ఋణము తీరినదమ్మా ! నా పుట్టిల్లు బుగ్గి అయిపోయిందమ్మా! " యని కేకలు వేయుచు దోసెడు మన్ను తీసి యన్నగారి గుమ్మంమీఁద పారబోసి రవంతమట్టి తన నోట వేసికొని, తల బాదుకొని గుండె బాదుకొని లబలబ మొత్తుకొని, మున్ను గంగమ్మకు విరోధురాలైన యవ్వ యింటికి గణపతి యీడ్చుకొనిపోఁగా వెళ్ళి పెద్ద పెట్టున రోదనము చేసెను.

పదునాల్గవ ప్రకరణము

భగవంతుడు గణపతికిఁ గావలసినంత యభిమానమునే ప్రసాదించెను గాని యైశ్వర్యమును బ్రసాదింపలేకపోయెను. మేనమామమీఁది కోపముచేత వేరింటి కాపురము చేయవలయు