పుట:Ganapati (novel).pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

గ ణ ప తి

పుట్టింటివా రెప్పుడు బుగ్గయిపోవుదురో, నన్ను పెట్టిన వుసురు తగులకపోదు. ఆడపడుచు నుసురుపెట్టినవా ళ్ళక్కరకురారు. ఆడపడుచుల ఉసురు ఒక్కనాటితో పోదు. ఏడేడు తరాలు కట్టి కుడుపక పోదు. ఆడపడుచు నేడిపించినవారి వంశము నిర్వంశము కాకమానదు. ఆ దిక్కుమాలిన రాయప్ప యెక్కడ దొరికినాడురా, నాయనా ? వాని మొగము మండ ! వాని మొగాన ప్రేతకళే గాని మంచికళ లేదురా, నాయనా? పెండ్లియోగ మెక్కడున్నదో ఆ మొగానికి, నాకు తెలియదు?" అని రెండవసారి రుద్రపారాయణము చేసెను. గంగమ్మను నామె పుట్టినింటివారిని జామాత కావలసిన రాయప్పను నోటికి వచ్చినట్లు తిట్టుట చేత గంగమ్మ కోపించి యా తిట్లఋణ మాడుబిడ్డకు వడ్డీతో దీర్చెను. ఇద్దరు కలియబడి కొట్టుకొన్నట్లు కయ్యమాడిరి. అంతట నాగన్న కోపావిష్టుడై సోదరిం జూచి "యిష్టము వచ్చినట్లు కారుకూతలు కూసి నన్ను, నా భార్యను, నా యత్తవారిని నా యల్లుని నోటికి వచ్చినట్లు తిట్టుచున్నావు. సుఖముగా నేను పెండ్లి చేసుకోఁ దలఁచు కోగా నీవు అమంగళము లాడుచున్నావు గనుక నీవు నాయింటిలో నుండవద్దు. నీవు నీ కొడుకు ఈ క్షణం లేచిపొండి. ఒక్క నిమిషమున్నారంటే నే నోర్వను. పొండి. మీ సామాను లేమున్నవో తీసికొనిపొండి" యని కఠినముగాఁ బలికెను. మేనమామ తన విషయమై పలికిన పలుకులకుఁ దల్లి నాడిన మాటలకుఁ దగిన ప్రత్యుత్తరముఁ జెప్పవలె నని గణపతి రెండు మూఁడు