పుట:Ganapati (novel).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

గ ణ ప తి

నని తల్లిం దోడ్కొనిపోయి పొరుగింట నిలుపఁగలిగెనే గాని, తన భుక్తికిఁ తల్లి భుక్తికి వొక్కపూటకు సరిపడునంత బియ్యమైన దేజాలకపోయెను. గణపతికిఁ దల్లికి నాగన్న మీఁదను గంగమ్మ మీఁదను గ్రోధమెక్కించి పుల్లవిఱుపు మాట లనియెడు సమిధల చేత ద్వేషవహ్ని రగుల్కొలిపిన యవ్వయు, దక్కిన యమ్మలక్కలును మాతాపుత్రులను రెండు మూడు పూటలు పోషించునప్పటికే కష్టమయ్యెను. తల్లికొడుకు లని లెక్క కిద్దరైనను రమారమి యేడెనమండుగురు మనుష్యులు గల కుటుంబమునకుఁ గావలసినంత సామగ్రి వారికి గావలసెను. గణపతి ప్రాయమున నిరువదేండ్ల లోపువాఁడైనను, జూపులకు వామనమూర్తి యైనను, జఠరాగ్ని వృకోదరుని జఠరాగ్ని వంటిదని యీ గ్రంథమునందే స్థలాంతరమున వర్ణింపబడియెఁ గదా! గణపతి భోజనప్రమాణముబట్టి యతని తల్లి భోజన ప్రమాణము జదువరులు మీ రూహించుకొన వచ్చును. అందుచేత సామాన్య గృహస్థులు వారిని భరించుట కష్ట మని వేఱె చెప్ప నవసరము లేదు. దినమునకు మూఁడు శేరులు బియ్యమున్న పక్షమున వారి కొకవిధముగా సరిపోవును. అది వచ్చునట్టి దారి పొడకట్టదయ్యెను. తల్లి కొడుకులు తన కొంపమీద బడి తిందురేమోయను భయమున బస యిచ్చిన యా యవ్వ గణపతినిఁ దల్లిం గూర్చుండబెట్టుకొని మూఁడవనాఁ డిట్లనియె.