పుట:Ganapati (novel).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

గ ణ ప తి

అంతటితో సంభాషణ ముగిసెను. నిద్రపట్టెను. తెల్లవారుజామున నాగన్న మేలుకొని భార్య చేసిన హితోపదేశముయొక్క పూర్వాపర్యములు స్థిమితముగా మనస్సులో విచారించి గణపతిని దనకూఁతు నిచ్చి వివాహము చేయుట వలన లాభములకంటె నష్టము లెక్కువ యున్నవని తెలిసికొని, యిల్లాలుచేసిన హితోపదేశమె సమంజసమై యున్న దని గ్రహించి, తన యభిప్రాయము భార్య కెరిగించి తన మనో నిశ్చయమును మామగారికిఁ దెలియజేయుటకయి జాబు వ్రాసెను. ఆ జాబు చూచుకొని యతని యత్తమామలు పెండ్లికొడుకయిన రాయప్పను వెంటబెట్టుకొని వచ్చిరి. ఈ బంధువు లేలవచ్చిరో నాగన్న తోఁబుట్టువునకుఁ గాని గణపతికిగాని స్పష్టముగ దెలియలేదు. కాని భార్యాభర్తలు పలుమారు గుస గుస లాడుటం బట్టియు, నత్తమామల రాకం బట్టియు వారనుమానపడిరి. కాని స్పష్టమగు వరకు నోరెత్తఁ గూడదని యూరకుండిరి. గంగమ్మ చెప్పిన ప్రకారముననె రాయప్ప నాలుగువందల రూపాయలు రొక్క మిచ్చుటకును, నూరురూపాయలు నగలు పెట్టుటకు, బాజాభజంత్రీలతోఁ దరలివచ్చి వివాహము చేసికొనుటకు నొడంబడి ఋణము దీర్చుకొనుటకు ముందుగా నేబది వరాలు అనగా రెండువందల రూపాయలు నాగన్న కిచ్చెను. నాగన్న ఋణము దీర్చి బాధానివారణము చేసికొనెను. అనంతరము