పుట:Ganapati (novel).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

223

మనకు ఋణవిముక్తి కావలెనుగదా? గణపతి దగ్గర నాలుగు వందల రూపాయలు కాదుగదా నాలుగు రూపాయలు కూడ లేవు. మనకే మియ్యగలడు? పిల్లను మేనల్లున కుచితముగా నిచ్చి వివాహము చేసినపక్షమున అప్పులవాళ్లు మన యిల్లు వాకిలి అమ్ముకొని పోదురు. నిలువ నీడలేక మనము చెట్టుమీది పక్షులు లాగు దేశములపాలై పోవలెను. అందుచేత గణపతికి పిల్ల నియ్యవలె నన్నమాట తలచుకోవద్దు. నే చెప్పినట్లు మా రాయప్పకే యివ్వండి!"

"నీవు చెప్పినమాట సరిగనే యున్నది కాని ఆడుపడుచు దుఃఖపడిపోవునని నాకాలోచనగా నున్నది. లేక లేక దాని కొక్క పిల్లవాడు కలిగినాడు. ఏలాగైనా వాని నొక యింటివాని జేయ వలె నని దాని సంకల్పము. వాడు బుద్ధిలేనివాడన్న మాట నిజమే. అది నన్నే నమ్ముకొని యున్నది. అది యేడ్చిపోవును."

"పిల్ల నియ్యకపోతే ఆవి డేడ్చిపోవును. ఇచ్చిన పక్షమున నే నేడ్చి పోదును? ఇన్ను మాట లెందుకు. గణపతికి మీరు పిల్ల నియ్యదలచుకొన్న పక్షమున నే నే గోతులోనో దిగదలచుకొన్నాను. ఇది నిశ్చయము."

"లేనిపోని సాహసపుమాట లాడకు, తప్పు."

"మీ యిష్టము. నే నాలాగున జరిగింపదలచుకొన్న మాట నిజము."