పుట:Ganapati (novel).pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

225

నాగన్నయొక్క యత్తమామలును రాయప్పయు, వారి స్వగ్రామమగు పలివెలకుఁ బోయి ప్రధానముచేసికొనుటకు, ముహూర్తము నిశ్చయించుటకు రమ్మని నాగన్నకు జాబువ్రాసిరి. నాగన్నయు మంచి దినము చూచుకొని పలివెల వెళ్ళెను. మేనమామ ఋణము దీర్చిన సంగతి గణపతికిఁ దెలిసెను. అతఁ డా వార్త తల్లికిఁ జెప్పెను. తల్లి చుట్టుప్రక్కలనున్న యమ్మలక్కల కెరిగించెను. అమ్మలక్కలందరు సభజేసి భూమి విక్రయింపకుండ, గృహ మమ్మకుండ నాగన్న రెండువందల రూపాయలు సంపాదింప సమర్థుఁడు కాఁడనియు దనకూతును రాయప్ప కిచ్చి వివాహము చేయనొడంబడి యాతనియొద్దనే రెండువందల రూపాయలు పుచ్చుకొని ఋణము తీర్చుకొని యుండునని నిశ్చయించి, మేనల్లుఁ డుండఁగా మేనమామ పిల్లను పైవాని కిచ్చుట యధర్మమని నిర్ధారణముచేసి పిల్ల నిమ్మని గట్టిగా నడుగవలసిన దనియు నల్లరి చేయవలసిన దనియు బదిమందిని బిలిచి తగవు పెట్టవలసిన దనియు నాలోచన చెప్పిరి. ఆ యుపదేశము మాతాపుత్రులకు నచ్చెను. నాగన్న పలివెల వెళ్ళి ప్రధానము చేసికొని వచ్చిన తరువాత నొకనాఁడు రాత్రి భోజనానంతరమున సోదరుని బిలిచి తోఁబుట్టు విట్లనియె.

"అన్నయ్యా! మన బుచ్చి పుట్టింటి మొదలుకొని తప్ప కుండ దానిని నీవు గణపతి కిచ్చి పెండ్లిచేయుదు వని గంపంత ఆశపెట్టుకొని యున్నాను. నీవేమో రాయప్పకు పిల్ల నియ్యఁ