పుట:Ganapati (novel).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

215

మహాదోషమని పెద్దలు చెప్పినారు. అలా గెప్పుడు చేయకమ్మా! కావలసిన దేదో పెట్టె మాట దక్కించుకో, తల్లి వచ్చినదాకా!" యని "ఓరీ గణపతి! నేనిక్కడనె కూర్చుందును. నీ వన్నము తిను. కావలసిన దేమో యామె వడ్డించకపోతే యామెనే చీవాట్లు పెట్టెదను." అని గణపతిని గూర్చుండ బెట్టి తాను ప్రక్కనుఁ గూర్చుండెను. గణపతి మేనత్త యా చుట్టము నదివరకె యెఱిఁగియుండుట చేత జాటునఁ దాగక యెట్ట యెదుటికి వచ్చి "అయ్యా! ఎగదీసిన గోహత్య దిగదీసిన బ్రహ్మహత్య యన్న సామెత నిజమైనది. మామూలుగా నతఁడు తినగలిగినంత యన్నమే నేను నిన్న విస్తరిలో పెట్టినాను. అమ్మవారికి తోడినట్లు కుంభముతోడినా నని కోపపడి యెవరో బ్రాహ్మణుని తీసుకొని వచ్చి కనుపఱచి నన్నల్లరి పెట్టినాఁడు. కావలసిన పక్షమున మారుపెట్ట వచ్చునుగదా యని నేనీ రోజు తక్కువ యన్నము పెట్టినాను. నాలుగు మెతుకులే పెట్టి కడుపు మాడ్చఁ దలఁచుకొన్నా నని మిమ్ము తీసికొని వచ్చి గొడవ పెట్టినాఁడు. ఇతనితో నేను వేగలేను. ఏదో మనసులో పెట్టుకుని పూట పూట కీలాగున నానా బాధలు పెట్టుచున్నాఁడు. అన్న మెక్కువుంటే తీయ మనవచ్చును. తక్కువుంటే పెట్టమనవచ్చును గాని వడ్డించిన విస్తరి వదలిపెట్టి వీధిలోకి వెళ్ళి, దారిన వచ్చు వారినిఁ దీసికొనివచ్చి, నన్ను రవ్వ పెట్టవచ్చునా? నావల్ల తప్పుంటే మేనమామగారితో చెప్పి నన్ను శిక్ష చేయించవచ్చును. తన తల్లితో చెప్పి చీవాట్లు పెట్టించవచ్చును.