పుట:Ganapati (novel).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

గ ణ ప తి

లన్నారు. మనము తగిన ప్రాయశ్చిత్తము దీనికి చేయవలె. సరే, నాయనా ! నేను మడి కట్టుకోవలె నీవు వెళ్ళు. అన్నానికి మట్టుకిబ్బంది పడకు, నాయనా ! ఎప్పుడు లేకపోయినా నేనున్నాను" అని చెప్పి పంపెను.

గణపతి యిట్టట్టుదిరిగి రెండు జాము లగునప్పటికి స్వగృహమున కరిగి యన్నము పెట్టుమని మేనత్త నడిగెను. వెనుకటి దినమున నన్న మెక్కువ పెట్టినందుకు గొప్పయల్లరి చేసినాఁడని మేనత్త యీ దినమున గణపతికి విస్తరినిండ బెట్టక యన్నము కొంచెము తక్కువగాఁ బెట్టెను. అది చూచి గణపతి చివాలున పీటమీఁదనుండి లేచి విస విస వీధిలోనికి నడచిపోయి, దారిన వెళ్ళుచున్న బంధువు నొక్కని బిలిచికొని పోయి తన విస్తరిలో నున్న యన్నముఁ జూపి "చిత్తగించినారా ఈ దురన్యాయము! సరిగాఁ బెట్టక కడుపు మాడ్చి చంపు చున్నది. చూడండి ! విస్తరిలో నాలుగు మెతుకులు పెట్టినది. ఈ నాలుగు మెతుకులతో నా యాకలి తీరునా? పట్టెడన్నము పట్టెడుకూర తినఁగల ముండాకొడుకును గదా! ఈలాగున డొక్కమాడ్చి చంపవచ్చునా! నోరెత్తి మాటాడితే తంటా. ఎక్కువ పెట్టినా వేమంటే నాలుగు మెతుకులే పడవైచును. తక్కువ పెట్టినా వేమంటే గ్రామదేవతకు కుంభము తోడినట్లు తోడును. ఇంతకూ నా తల్లిముండ కోటిపల్లి వెళ్ళి కొంపతీసింది." అని చెప్ప, వచ్చిన చుట్ట మామె నుద్దేశించి యిట్లనియె. "అమ్మాయి! అర్థాన్నము బెట్టుట