పుట:Ganapati (novel).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

205

గట్టిగ నాలోచించి యొక యుపాయము పన్నెను. బిడ్డ నెత్తుకొమ్మని మేనత్త గాని మేనమామ గాని తనచేతి కిచ్చి వెళ్ళగానే యొక నిముస మెత్తికొన్నట్లేయుండి మెల్ల మెల్లఁగా గిల్లనారంభించెను. గిల్లిన తోడనే బాలిక గ్రుక్కవెట్టి యేడ్చుట సహజము కదా! అంత గ్రుక్కబెట్టి యేల యేడ్చుచున్న దని మేనత్తయో మేనమామయో పరుగెత్తుకొని వచ్చి యడిగినప్పుడు గణపతి నవ్వుచు "నేనేమి చేయగలను? అది నాదగ్గఱ నుండదు. నా మొగము చూడగానే యేడ్చు"నని యుత్తరము చెప్పుచుండును. నోరులేని పిల్ల కావునఁ దన కతనివల్లనే బాధ కలిగిన దని యా శిశువు చెప్పఁజాల నందున గణపతి యాతంత్రము కార్యసాధనమని పలుమాఱుఁ బ్రయోగింపఁ జొచ్చెను. ఈ ప్రయోగము వలన బాలిక గణపతిని జూడఁగానే పెద్దపెట్టున నేడ్వ నారంభించెను. "చూచినారా! అది నన్ను జూడగానే యేడ్చుచున్నది. నా మాట మీరు నమ్మరు!" అని గణపతి మేనమామతో మేనత్తతో ననుచుండును. ఒకటి రెండు సారులు బాలిక మేనెఱ్ఱగాఁ గందియుండుటఁ జూచి మేనత్త "ఏమోయీ గణపతీ! దీని కాలిమీఁద నెఱ్ఱగా కందిన దేమి? వీపుమీఁద నెత్తురు గ్రమ్మినట్లున్న దేమి?" యని యడిగెను. "కండచీమలు కుట్టినవి కాబోలు!" నని యతఁడు బదులు చెప్పెను. "నీ చంకనుండఁగా కండచీమ లేలాగున వచ్చి కుట్టినవోయి?" యని యామె మరల నడుగ "సరి సరి! బాగున్నదిలే! కండచీమలు కుట్టకపోతే