Jump to content

పుట:Ganapati (novel).pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

177

నీకు భయము. ఇది యీ గ్రామములో నెవరిది గాదు. కోమటుల యింట వివాహమునకు నేను రాజమహేంద్రవరము వెళ్ళినప్పుడు నాయదృష్టవశమువల్ల నా కిది దొరికినది. దొంగతనము చేసినానో దొరతనమే చేసినానో సంపాదించినాను. కొడుకు గొప్ప ప్రయోజకుఁడయి ముద్దినుసు వస్తువులు సంపాదించుచున్నాఁ డని సంతోషింపక వెఱ్ఱిముండలాగు విచారించుచున్నా వెందుకు? అయినదానికి కానిదానికి విచారించిన దాని బ్రతుకు విచారపు బ్రతుకే యగును. ఈ గ్రామములోనే నే నెందుకును పనికి రాకున్నాను గాని రాజమహేంద్రవరంలో నేనంటే నెంతో గౌరవము. అక్కడివారు నన్ను నెత్తిమీఁద బెట్టుకున్నారు. ఏ దుకాణములోనికి నేను వెళ్ళినప్పటికి వర్తకులు బీరువాలు తెరచి మూటలు విప్పి ముద్దినుసు గుడ్డలు నాకు చూపించినారు. నన్ను దయచేయ మని మర్యాద చేసి దండము పెట్టినారు. నా కీ జోడు దొరికినది. దొరికినది దొంగవస్తువగునా? వీధిలో మనము నడచి వెళ్ళునపుడు మనకే వస్తువైన దొరకవచ్చును. అది మన దగునా కాదా? అలాగే నా కీ జోడు దొరికింది. ఒకరి చేతిలో నుండఁగా నేను లాగుకొనలేదు. ఒకరి పెట్టె బ్రద్దలు కొట్టి నేను దీసికొనలేదు. ఒకరి కాలి నుండి నె నూడఁదీయలేదు. నా పుణ్యమువలన నాకు దొరికినది. ఇదే దొంగతనమైతే మనము జేయుచున్న ప్రతిపనియు దొంగతనమే యగును. యజమానితోఁ జెప్పకుండ మనము దంతధావనము కొఱకు చెట్టునుండి యొక