పుట:Ganapati (novel).pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

గ ణ ప తి

కొనవలె, లేకపోయిన నోరు మూసికొని యూరకుండవలె" నని తనమీద నిందారోపణము చేసినవారికి పది పుంజీల చీవాట్లంటగట్టి తన కాప్తులయినవారిని నలుగురిని వెంటబెట్టుకొని యిచ్చవచ్చిన చోటు లెల్ల విహరించి యింటికిఁ బోయెను. ముచ్చెలజోడు తొడిగికొని తన కన్నులకు బండువుచేయుచున్న కుమారుని జూచి తల్లి యానందించి రాత్రి భోజనమైన తరువాత గణపతి పండుకొనఁగా నతని ప్రక్కంజేరి యిట్లనియె "నాయనా జోడు మిక్కిలి బాగున్నది. మొట్టమొదట నది యిప్పటికన్న బాగున్నది. నీకిదేలాగు దొరికినది? నీవు కొన్నావా? ఎవరైనా బహూమాన మిచ్చినారా? దానిమీఁద జరీపోగు నీ వెందుకు తీసివేసినావు? ఎవరిదైన దొంగతనముగా దీసికొని రాలేదుకద. ఎఱ్ఱతలపాగాల బంట్రోతులు వచ్చి రెక్కలుగట్టి తీసికొనిపోదు రేమో యని భయము. అందుచేత నడిగినాను. ఏలాగున దొరికినదో చెప్పునాయనా! తెలియక దొంగతనముగ దెచ్చిన పక్షమున వారిది వారి కిచ్చివేయుదము. మామయ్య విన్నపక్షమున మిక్కిలి కోపపడి నిన్ను గొట్టఁగలడు. ఈ గడబిడ యెందుకు? ఉన్న దున్నట్టు చెప్పు. ఈ యూరి దయితే రాత్రివేళ గోడమీఁదనుంచి వారి దొడ్డిలో గిరవాటు వేయవచ్చును. పొరుగూరి దయితే మరియొకలాగు సర్దుకోవచ్చును!" అని మందలించుటయు నులకకుక్కిమీద బండుకొన్న గణపతి దిగ్గునలేచి కూర్చుండి, తల్లి కిట్లనియె అమ్మా! ఎందుకు