పుట:Ganapati (novel).pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

గ ణ ప తి

పండ్లుతోము పుడక విఱుచుకొందము. అది దొంగతనము గాదా? చెట్లనుండి పువ్వులు కాయలు కోసికొనుచున్నాము. అది దొంగతనము కాదా? కష్టపడి కన్నదూడలకు లేకుండ ఆవులను గట్టిపెట్టి పాలు పితుకుకొనుచున్నాము. ఇది దొంగతనముకాదా? దొంగతనముల మాట నాదగ్గఱ జెప్పకు. ఎవరి కేది ప్రాప్తమో ఆ వస్తువు వారిదగ్గర పడును. అది దొంగతన మనుట తెలివితక్కువ. ఇది నా కేలాగు వచ్చినదో రెండవ కంటివాఁడెఱుఁగఁడు. ఇందుకోసము బెంగపెట్టికొని నీవు చావనక్కఱలేదు! ప్రపంచ మంటే యేమిటో తెలియని యమాయకపు ముండవు. కనుక ఎఱ్ఱ తలపాగాల వారంటే నీకు భయం. నాకట్టి భయము లేదు. వాళ్లు నాదరికి వచ్చినారంటే తుపాకి వేయించఁ గలను. రెండుకోట్లు నా కుండనీ; ఆ కోట్లు తొడిగికొని, గిరజాలు నున్నగా దువ్వుకొని, కుచ్చు తలపాగ జుట్టి, ముచ్చెలు దొడిగికొని, బెత్తము చేతఁబట్టుకొని, టక్కు టిక్కు టక్కు టిక్కు మని బయలుదేరి నానంటే ఎఱ్ఱ తలపాగాల వాళ్ళు, నల్ల తలపాగాలవాళ్ళు, వీఁడెవఁడురా బాబూ! డిప్యూటీ కలెక్టరులాగున్నాఁడని తోకతెంచుకొని పోఁగలరు. నేనేమి? మునుపటి చచ్చు గణపతి ననుకొన్నావా యేమి? రాజమహేంద్రవరములో నెన్ని టస్సాలు నేర్చినా ననుకొన్నావు? ఎన్ని తమాషాలు నేర్చినా ననుకొన్నావు? గిరజా యెదిగినతరువాత, కోటు