పుట:Ganapati (novel).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

175

విహరించెను. కొందఱు స్నేహితు లాతని జూచి "గణపతీ! పైజారు లెంతకు గొన్నావురా?" యని యడుగ నతడు వెలవెలబోయి తత్తరపడి నొకనితో నర్థరూపాయ యనియు మఱియొకనితో మూడుపావలా లనియు యొకనితో రూపాయ యనియు వేఱొకనితో "నాకిది రాజమహేంద్రవరములో నొక కోమటి పిల్లవాఁడు బహుమాన మిచ్చె" ననియు, ఇంకొకనితో "మామామ కొనిపెట్టినాఁడనియు" నొకరితో జెప్పిన విధమున మరియొకనితో జెప్పక పరిపరివిధముల బ్రత్యుత్తర మిచ్చెను. మిత్రు లనేకులు "గణపతి మిక్కిలి యదృష్టవంతుడు. అతఁ డేదోవిధమున దన కోరిక దీర్చుకొనును" నని శ్లాఘించిరి. ఒక రిద్దఱు మాత్రము "వీ డెక్కడనో దొంగతనముజేసి తెచ్చినట్లున్నాఁడు. కాని యెడల వీనికీ ముచ్చెలు బహుకరించువాఁడెవ్వడు? పెండ్లికి వచ్చినప్పుడు, వీనిదగ్గర నెఱ్ఱని యేగాని లే" దని నిరసించిరి. వారి మాటలకు గణపతి యెంతమాత్రము సరకు సేయక "చేతగాని కుంకలు, అప్రయోజక వెధవలు. తాము ప్రయోజకత్వముచేతఁ దెచ్చికొనలేరు. ఎవఁడైన సంపాదించుకొన్నయెడల దొంగతనమని సింగినాదమని జీలకఱ్ఱయని పేర్లుపెట్టి వెక్కిరించుచుందురు. ఈ నిర్భాగ్యులేమనుకొన్న నాకేమి? ఏలాగో యొకలాగున సంపాదించుట ప్రయోజకత్వము. దొంగతనము చేసినను సరె పట్టుబడకుండుట దెలివి. నేను కొంటే వీళ్ళ కెందుకు? నేను కొనకపోతే వీళ్ళకెందుకు? చేతనైతే సంపాదించు