పుట:Ganapati (novel).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

169

చేయుచుండ నీవు వీధులవెంట నడుచునపు డెల్లరకు ముద్దుగా నుండును. కాబట్టి చడావులే కొనవలసిన దని మరియొకఁ డాలోచనము చెప్పెను. చేతిలో డబ్బు లేకపోయినది కాని గణపతి ముచ్చెలు చడావులు కూడ కొనఁగోరెను. రెండింటిని గొనుమని యడిగిన బాగుండదని తనలో దానె విచారించు కొని పెండ్లి కుమారునికడ కరిగి కొంతసే పామాట లీమాటలాడి యతఁడు గూడ తన గిరిజాల విషయమై కొంత పరామర్శచేసిన పిదప తన మనోరథ మెఱిఁగింప దలఁచి యిట్లనియె "నీ వింత వైభవముగ వివాహము చేసికొను చున్నందుకు నాకేదైన మంచి బహుమానము నీవు చేయవలెను. ఎలాగైనను నీవొక జామారుగుడ్డ నా కీయకపోవు. జామారు నాకక్కరలేదు. ఈ మధ్య షొడశ బ్రాహ్మణార్థములలో నాకేడెనిమిది గుడ్డలు దొరికినవి. బట్టల కరవు లేదు. నాకిప్పుడు కావలసినది మంచి పెద్దాపురపు పైజార్ల జోడు. పొట్టివాడ నగుటచేత మిట్ట పైజార్ల జోడు నా కాలి కందముగా నుండునని మనవాళ్ళు చెప్పినారు. దాని ఖరీ దర్థరూపాయి. ఏలాగైనను నీవు నాకిది కొనిపెట్టక తప్పదు. ఏమిటి నీ యభిప్రాయము? నాకోరిక తీర్చెదవా లేదా?" అనపుడు పెండ్లికుమారుఁ డిట్లనియె "నాదగ్గఱ డబ్బులులేవు. నాలుక పెరికికొన్నను మాతండ్రి నాచేతికి రాగిడబ్బైన నీయఁడు. సదస్యము నాఁడు నీవు చూచితివిగదా రూపాయ రూపాయ సంభావన వచ్చునని బ్రాహ్మణు లెంతో యాసపడి రాఁగా మా