పుట:Ganapati (novel).pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

గ ణ ప తి

కొని రానేల" యని మిత్రు లెగతాళిచేయఁ జొచ్చిరి. న్యాయము చెప్పినాను. కాని నాకెందుకని గణపతి ప్రత్యుత్తరము చెప్పి, ఎంద రెన్నివిధము లెగతాళి చేసినను వాని భావము గ్రహింపలేక తనగుట్టు బయటపడలేదని నమ్మి సంచరించెను. రాజమహేంద్రవరమున జనులను జూడఁగా నతనికి మఱియొక యుబలాటము గలిగెను. చెప్పులు మోటవాండ్రు దొడుగుకొన వలసినవె కాని నాగరికులకుఁ దగనివనియు,నాగరికులు పాదము లకు దొడుగుకొనవలసినవి ముచ్చెలో చడావులోగాని చెప్పులు కావనియు నతని మనస్సునకుఁ దట్టెను. తట్టినతోడనే యతఁడు తన పాఁత చెప్పు లమ్మఁజూపెను. ఆ చెప్పు లతని కాలునకేగాని మరియొకరి కాలునకు సరిపడనివగుటచే నవి కొనువారెవ్వరు లేకపోయిరి. సంపాదించిన డబ్బులు చాకలివాండ్రకు లంచమిచ్చుటక్రింద వెచ్చబెట్టబడినందున క్రొత్తజోడు కొనుట కతనికడ డబ్బులేకపోయెను. అదిగాక ముచ్చెలు కొనుట మంచిదా చడావులు కొనుట మంచిదా యను విషయ మతఁడు విచారణ చేయ దొడఁగి సంగడికాండ్రనడుగజొచ్చెను. "మిట్ట ముచ్చెలు నీకాలికెంతో యందముగ నుండును. అవి తొడుగుకొని టక్కు టిక్కుమని నీవు నడిచితివా చూచువారి కెంతో ముచ్చటగ నుండును. కాబట్టి ముచ్చెలే కొనుమని యొకఁడు సలహా చెప్పెను. ఒంటియట్ట చడావు నీ పాదమున కెంతో సొగసుగ నుండును. చడావు తొడిగికొని అవి కిఱ్ఱుకిఱ్ఱుమని చప్పుడు