పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత దేశ దుర్గతికి నాయన ఎంతగా పరితపించు చుండెనో ఈ గ్రంథమున అక్కడక్కడ వ్యక్తమగు చున్నది. "శత్రు భారముచే భిన్నమైయున్న భారత దేశమును రక్షించుటకు, ఓ తల్లీ! నాకు బలము ఇమ్ము, దుర్మార్గుల వినాశము కొఱకు నాకు నీవు అస్త్రముగా నుండుము; నా బుద్దిని శక్తివంత మగునట్లు చేయుము. భారత దేశ దుర్గతిని చూచుచు దు:ఖమును పొందుచున్న నాకు యోగ మదము (సిద్ధి) వలన తృప్తి కలుగుట లేదు."[1]

19-5-1922 న భగవానుని తల్లి అలఘమ్మ నిర్యాణము నొందెను. ఆమె సమాధిపై మహర్షి లింగాకారముతో వున్న యొక శిలను ప్రతిష్ఠించెను. దానికి "మాతృ భూతేశ్వర లింగము" అని నాయన నామకరణము మొనరించెను. పిదప నాయన చూత గుహలో నాలుగు నెలలు తపస్సు చేసెను. 1923 ఫిబ్రవరి ముగియు నప్పటికి ఇంద్రాణి సప్తశతిలోని శ్లోకములను సుమారుగా నాలుగు వందలు ఉమాస్తుతిలో చేర్చి సహస్రముగా శుద్దప్రతి వ్రాసి రమణునకు సమర్పించెను.1942 లో ముద్రింపబడిన యా గ్రంథమునకు ఈ ప్రతియే ఆధార మయ్యెను. ఆయన ఉమాస్తుతి నుండి కొన్ని శ్లోకములను ఇంద్రాణి సప్తశతి యందు చేర్చి కొన్ని క్రొత్త శ్లోకములను కూడ కూర్చి దానిని గూడ తీర్చి దిద్దెను.

  1. * నాయన పుటలు-530, 531.