పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును పొంది ఆ ప్రాంతమునకు శాపాగ్ని వలన సంతాపము కలుగకుండ ఇంద్రుని స్తుతించెను.

శాపము వెలువడినంతనే భగవానుడు మౌనముతో కనులు మూసికొనియుండెను. కొంతసేపటికి నాయన కావించిన స్తుతివలన పెద్ద వర్షము కురిసెను. భగవానుడు లేచి ఆకాశము వంక జూచుచు వానలో నిలుచుండెను. దేవాలయము వద్దనున్న రథముపై పిడుగు పడి దానిని దహించెను. భగవానుడు "అమ్మయ్య! బ్రతికితిమి" అని స్కందగుహ నుండి దిగి విరూపాక్ష గుహ యొద్దకు వచ్చి నాయనకు దగ్ధమగుచున్న రథమును చూపెను. నాయన ఖేధమును పొందెను. భగవానుడు నాయనను చూచి, "క్రోధము ఇట్లే విచక్షణతను కప్పివేయును. భూమికి ఆపదయైనచో మనకు కాదా! రథము కొఱకు విచారింపకుడు. ప్రాతది పోయినచో క్రొత్తది వచ్చును. ఏమైనను ఇకమీద క్రోధమునకు వశముగానని ప్రమాణము చేయుడు" అనెను. నాయన అట్లే ప్రమాణమొనర్చి గురువునకు వ్యధకలిగినందులకు దు:ఖించెను. భగవానుడు నాయనను ఓదార్చుచు గుహలోనికి తీసికొనిపోయి పెరుగు అన్నమును స్వయముగా తినిపించెను. కొలది దినములకే పలని మృత్యువు వాతబడెను.

విరూపాక్షగుహ వసతిగా లేకపోవుటవలన నాయన స్కందాశ్రమమున రమణునితో ఉండజొచ్చెను. అక్కడ దశ మహావిద్యలసారమును సంగ్రహించుచు నాయన 475 సూత్రములను మూడు దినములలో రచించెను. తరువాత, అంతకుపూర్వ మారంభించిన "హృదయ కుహర" శ్లోక వ్యాఖ్యాన గ్రంథమును రమణోపదేశముల