పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9. క్రోధాగ్ని

1917 జూన్‌లో నాయన మందసా నుండి తిరువణ్ణామలై చేరెను. అప్పటికి చూతగుహ వాసయోగ్యముగా లేదు. దానికి మరమ్మత్తు అవశ్యకమైయుండెను. నాయన ఎచ్చెమ్మాళ్ ఇంటియందు కాపురముండి "హృదయకుహర మధ్యే" అను శ్లోకమునకు వ్యాఖ్యానముగా ఉపనిషత్తువంటి గ్రంథమును 7-7-1917 తేది ఆరంభించెను. 23వ తేది విరూపాక్ష గుహయందు తాను సకుటుంబముగా నుండుటకు నాయన మహర్షి యనుమతిని కోరెను. గృహస్థులు ఆ గుహయందు ఉండరాదను నియమము ఉండెను. అయినను అమ్మనాయనలు బ్రహ్మచర్యముతో నున్నారని కాబోలు మహర్షి నాయనకు అనుమతి నొసంగి, పలనిని పిలిచి అ గుహను బాగుచేయుమని చెప్పెను. అతడు దానికి తాళమునుకూడ తీయలేదు. నాయన వచ్చి మహర్షికి ఆ విషయమును చెప్పెను. మహర్షి పలనిని పిలిపించి నాయనకు తాళపుచెవినైన ఇమ్మనెను. ఆ గుహలో నాయన సంసారము చేయుటకు వీలులేదని చెప్పుచు తాళపుచెవి నిచ్చుటకు కూడ అతడు నిరాకరించెను. భగవానుని యాజ్ఞను తిరస్కరించుటయేకాక తన బ్రహ్మచర్యమునుకూడ పలని శంకించి, తన్ను సంసారిగా తలంచుట నాయనకు అవమానకర మయ్యెను. అది ఆయనయందు క్రోధమును ప్రజ్వలింప జేసెను. దానివలన "ఖాండవవనమునందు అర్జునునివలె నేనిప్పుడు ఇచ్చట క్రోధాగ్నిని వదలుచున్నాను" అనునర్థముతో శ్లోకరూపమున నాయన నుండి శాపము వెలువడెను. అంతట ఆ తాళమును ఱాతితో పగులగొట్టి నాయన గుహయందు ప్రవేశించెను. వెంటనే ఆయన పశ్చాత్తాప