శివరాత్రి దినమున మందసా రాజుయొక్క సాయమున నాయన శిష్య సమేతుడై శిఖరమున నున్న యాలయమును చేరి అందున్న లింగమును పరీక్షించెను. పశ్చిమ గోకర్ణమున లింగము గోవు చెవి యొక్క ఆకృతిలో నుండగా ఇక్కడ గోవు చెవియొక్క రంధ్రము వంటిదే లింగము నందు రంధ్రము వుండుటను గమనించి ఈ లింగమును 'దహర గోకర్ణేశ్వరుడు' అని నాయన పేర్కొనెను. దహర మనగా రంధ్రము లేక లోపలి ప్రదేశము - ఆ యాలయమునకు ప్రక్కన విష్ణు దేవుని యాలయ ముండెను. ఆ దేవుడు పరశురాముడని నాయన గ్రహించెను. ఆ రెండు ఆలయముల మధ్య కూర్చుండి నాయన 20 దినములు 'అహం' మూలాన్వేషణ రూపమును తపస్సు చేసి తన యందు పరశురాముని తేజస్సు ప్రవేశించినట్లుగా అనుభూతిని పొందెను.
వాసిష్ఠ వైభవము నందు దైవరాతుడు గురువును దర్శించుటకు వచ్చిన తరువాత పింగళ సంవత్సర జ్యేష్ఠ మాసారంభమున 1917 జూన్‌లో మందసా నుండి నాయన అరుణాచలమునకు పోవునప్పుడు నెల్లూరియందు సభలలో ఉపన్యసించుట జరిగెనని చెప్పబడియున్నది.*