పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పొందుపరచబడి యుండలేదు. ఇందలి సంజ్ఞలుకూడ శ్రీ గణపతి ముని గారిచే కల్పింపబడినవి. ఈ గ్రంథమునకు నిర్ణయ సంగ్రహ మను పేరుగల గాణపత శాస్త్రమని పేరు. ఈ శాస్త్రమునకు శేష ఫలాధ్యాయములుగా త్రిభావ ఫలచంద్రిక షోడశశ్లోకి అను చిన్న కృతులు రచింపబడినవి. 1966లో గణపతిశాస్త్రి గారి ప్రియ శిష్యులగు గుంటూరు లక్ష్మీకాంతముగారు గణపతిముని కృతులను తెలుగులో ప్రచురించుచు 'పారాశర్య కేరళీయ సముచ్చయము' అను పేరుతో దీనిని ప్రచురించిరి. జ్యోతిష పండితులగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు దీనికి తెనుగు తాత్పర్యము వ్రాసిరి.*[1]

గోకర్ణములో నాయన ఆ ప్రాంతమునందు ప్రచారములో నున్న వేదములోని యధిక భాగములను పాఠము చెప్పించుకొని యొక పక్షము దినములలో కంఠస్థ మొనర్చెను. ఆ భాగములందు భాగవతములోని కృష్ణలీలాఘట్టముల కాధారము లుండుట నాయనకు ఆశ్చర్యమును కలిగించెను.

కొన్నినాళ్ళైన తరువాత నాయన నగరములో నుండుటకు ఇష్టపడక సమీపమందున్న యుమామహేశ్వర పర్వతముపైఉన్న గణపతి దేవాలయమున భార్యతోకూడ తపస్సు చేసికొనుటకు నిశ్చయించెను. అక్కడ వారికి సహాయుడుగా ఉండుటకు గణేశశర్మ అను యువకుడు ముందునకు వచ్చెను. అతని గోత్ర ప్రవరలోని దేవరాతఋషినిబట్టి అతనిని దైవరాతునిగా నాయన పేర్కొనెను.

  1. * జయంతి సంచిక పుట - 64