పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాసుదేవశాస్త్రిని అరుణాచలమునకు పంపి, వేలూరునకు పోయి కళ్యాణరామునితో పడైవీడునకు పోయెను. రేణుకాక్షేత్రమైన కుండలీపురము పడైవీడుగా ప్రసిద్ధమయ్యెను. ఇది కుండలినీ నదీతీరమందున్నది. అచ్చట నాయన కొన్నాళ్ళు ధ్యాన మొనర్చుచు కళ్యాణరామునకు స్వస్థతను కలిగించుచుండెను.

ఆ సమయమున వాసిష్ఠుడు మంత్రదీక్షలచే యువకులను వెఱ్ఱెత్తించుచున్నాడని వారిని ప్రభుత్వముపై తిరుగుబాటునకు సన్నద్ధము చేయుచున్నాడని ఉమా సహస్రములో ఆ భావములే ఉన్నవని కొందఱు అపవాదులను ప్రబలజేసిరి. ఈ వార్తలు అధికారులచెవుల కెక్కెను. వారు విచారణకు పూనుకొనిరి. పోలీసులు కావ్యకంఠుని ప్రశ్నించుటకు వచ్చిరి. ఆయన కనుసైగచేయగా శిష్యులు ఉమాసహస్రమును గైకొనిపోయి కుండలినీ నదీతీరమున ఇసుకలో ఒకచోట దాచియుంచిరి. పోలీసులు ఆయనను విచారించి అపరాధి కాడని నిశ్చయించుకొని వెడలిపోయిరి. ఆ రాత్రి నదికి వఱదవచ్చి గ్రంథము కొట్టుకొని పోయెను.

కుండలినీనది గ్రంథమును హరించెనని, అయినను విచారింప వలసిన పనిలేదని, దానిని తాను మరల రచింపగలనని నాయన రమణునకు కబురుచేసెను. ఆ క్షేత్రమును వీడుమని పోలీసులు హెచ్చరించినను ఆయన అచ్చటనే యుండి రేణుకను ధ్యానించుచుండెను. 12-5-1908 తేది విశాలాక్షమ్మ ఆడపిల్లను ప్రసవించెనని తెలిసి నాయన వేలూరునకు పోయి పుత్రికకు వజ్రేశ్వరి యని నామకరణ మొనర్చెను.