పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మును కొనసాగ నిచ్చినచో కొంత కాలమునకు అది క్రమముగా క్షీణించు నను తలంపుతో మహర్షి వాసిష్ఠుని యభిప్రాయమును నేరుగా ఖండింప లేదని తలంప వచ్చును. ఏమైనను యోగులకు తత్త్వవేత్తలకు సంకల్పములు పనికి రావనుట ప్రసిద్ధము. "సంకల్పమును వీడనివాడు ఎవడును యోగి కాజాలడు." (న హ్యసన్న్యస్త సంకల్పో యోగీభవతి కశ్చన - గీత) అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టముగ చెప్పెను. "జ్ఞానామృతముచేత తృప్తుడు కృత కృత్యుడును అయిన యోగికి కర్తవ్యము ఏదియు నుండదు; ఉన్నచో అతడు తత్త్వజ్ఞుడు కాడు" అని విద్యారణ్యస్వామి ఉద్ఘాటించెను.

శ్లో|| జ్ఞానామృతేన తృప్తస్య కృతకృతస్య యోగిన:
    నై వాస్తి కించిత్ కర్తవ్య మస్తి చేత్ న స తత్త్వవిత్||

8. తపోయాత్ర

వాసిష్ఠుడు బయలుదేరుచుండగా వాసుదేవశాస్త్రిని తోడుగా తీసికొని పొమ్మని మహర్షి చెప్పెను. అట్లే ఇద్దఱు చెన్నపురియొద్ద తిరువొత్తియూరునకు చేరిరి. అచ్చట కపాలిశాస్త్రి నాయనకు శిష్యుడయ్యెను. అక్కడ తపస్సు చేయుచుండగా ఒకనాడు మహర్షి వచ్చి తన్ను స్పృశించి ఆదరించినట్లుగా వాసిష్ఠునకు గోచరించెను. కళ్యాణరామునకు రేణాకాదేవతావేశము కలిగెనని తెలిసి నాయన,