Jump to content

పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధింపవలె. మీ రందరు రమణ నామ స్మరణముచే ధన్యు లగుదురు గాక. ఇందులకు మనకు సహాయ మగుటకు ఈ క్షేత్ర దేవతయైన సహాయవల్లిని ప్రార్థింతము." ఇట్లు చెప్పి కావ్యకంఠు డొక శ్లోకమున ఆ దేవిని ప్రార్థించెను. ఆనాటి నుండి స్వామికి "భగవాన్ శ్రీ రమణ మహర్షి" అని, వాసిష్ఠునకు "నాయన" అని నామములు ప్రసిద్ధము లయ్యెను.

వాసిష్ఠుని లేఖ వలన "నాయన" వృత్తాంతము నెఱింగి దీపోత్సవము నాటికి విశాలాక్షమ్మ ముప్పది మంది శిష్యులతో వచ్చెను. ఆమెను చూచి మహర్షి "అమ్మ వచ్చినది" అని నాయనతో చెప్పెను. నాయన ఆమెను "అమ్మా" అని సంబోధించెను. ఆమెకూడా భర్తను "నాయన" అని సంబోధించెను. ఆ సన్నివేశమును చూచుచుండగా మహర్షికి సంతోషమున కన్నుల నుండి బాష్పములు స్రవించెను. పిదప ఆమె శిష్యులతో కూడ భగవానునకు వందనము గావించి శరణాగతి చేసెను. అమ్మను గుహలోనికి పిలిచి వాసిష్ఠు డామెకు తారా మంత్రమును ఉపదేశించి దానిని వ్యాపింప జేయుటకు అధికార మొసంగెను. అప్పుడు పర్వత శిఖరముపై జ్యోతి వెలిగెను. ఆ జ్యోతికి భగవానునకు అందఱు ప్రణమిల్లి బయలు దేరిరి.

నాటి నుండి అమ్మ నాయనలు తమకు భగవానునిచే వానప్రస్థాశ్రమము అనుగ్రహింప బడినదని తలంచిరి. భార్యతోకూడ బ్రహ్మచర్యము నవలంబించి తపస్సు చేసికొనుచుండుటయే వానప్రస్థమునకు ముఖ్య లక్షణము.