పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మఱునాడు అమ్మ శిష్యులతోకూడ వెళ్ళిపోయెను. భగవానుడే స్వయముగా చూపిన చూతగుహలో వాసిష్ఠుడు తపస్సును ఆరంభించెను. మహర్షికి అన్నమును తీసికొనివచ్చుచున్న ఎచ్చెమ్మయే వాసిష్ఠునకు కూడ భోజనం సమకూర్చుచుండెను. రమణోపదేశము వివరించుచు వాసిష్ఠుడు దేవీస్తవ రూపమున ఉమాసహస్రమును ఇరువది దినములలో ముగించుటకు దీక్షబూని గురుని యనుమతినిపొంది 26-11-1907 నుండి గ్రంథమును ఆరంభించెను. గడువులోపల పూర్తి కాకున్నచో గ్రంథమును చింపి వేయుదునని ఆయన శపథమొనర్చెను. గ్రంథము కొన్ని దినములు వేగముగా జరిగెను. తుది దినములలో ఆయనకు కుడిచేతి బొటనవ్రేలిపై గోరుచుట్టువంటిది ఏర్పడి వ్రాత మందగించెను. గ్రంథము ఏమగునో అని అందఱు ఆందోళన చెందజొచ్చిరి. స్వప్నమున ఒక బ్రాహ్మణుడు ఆదేశించెనని పుణ్యకోటి అను వైద్యుడు వచ్చి ఆ వ్రణమునకు చికిత్సచేసెను. బాధ తొలగినను వ్రాయుటకు వ్రేలికట్టు అడ్డముగా నుండెను. ఇరువదియవ దినమునకు ఇంకను 250 శ్లోకములు కావలసి యుండెను. ఆ రాత్రి అయిదుగురు లేఖకులను ఏర్పరచుకొని వాసిష్ఠుడు ఆశువుగా శ్లోకములను చెప్పనారంభించెను. మహర్షి ఆయనకు వెనుకకూర్చుండెను. అర్థరాత్రమునకు పూర్వమే నాయన ఒక్కొక్క లేఖకునకు 50 శ్లోకములను చెప్పి గ్రంథమును ముగించెను. అప్పుడు రమణుడు సమాధినుండిలేచి "నాచే చెప్పబడినదంతయు వ్రాసికొంటిరా?" అని యడిగి అందఱకును ఆశ్చర్యమును కలిగించెను. నాయన సంతోషముతో, "చిత్తము, అట్లే గ్రహించి గ్రంథమును ముగించితిని" అనెను. అది అట్లు పూర్తి