అప్పటికే వారికి భీమశాస్త్రి కలిగి యుండెను. వానికి రెండేండ్ల వయస్సులో పెద్ద జబ్బు చేసెను. పిల్లవాడు జీవించినచో అరసవల్లి క్షేత్రమున పుట్టుజుట్టు నిత్తునని తల్లి మ్రొక్కు కొనెను. బాలుడు బ్రతికెను. వానికి మూడవ యేట మ్రొక్కు తీర్చుటకు ఈశ్వర సంవత్సర రథ సప్తమినాడు (9-2-1878) తల్లిదండ్రులు బాలుని గైకొని అరసవల్లి కేగిరి. ఇది ప్రసిద్ధమైన సూర్య క్షేత్రము. మ్రొక్కు తీర్చిన తరువాత నరసమాంబ "తండ్రి నీ కృపను ఇంతటితో ఆపకుము; దేశోద్ధారకుడైన పుత్రుని ప్రసాదింపు" మని సూర్య భగవానుని ప్రార్థించెను.
"వాసిష్ఠ వైభవమ్" లో నాలుగేండ్ల వయస్సుగల పుత్రునితో నరసమాంబ యొక్కతయే అరసవల్లికి పోయినట్లు చెప్పబడియున్నది.*[1]
పగలంతయు ఉపవాసము చేసి ఆ దంపతులు మంత్ర ధ్యానముతో గడపి రాత్రికి విశ్రమించిరి. నరసమాంబకు కలలో సూర్యాలయ ప్రాకారము యొక్క వెనుక భాగము నుండి యొక బంగారు వర్ణముగల స్త్రీ అగ్నిపూర్ణమగు బంగారు కలశమును గైకొని వచ్చి నవ్వుచు ఇచ్చి అంతర్ధానమైనట్లు కన్పించెను. అది విని నరసింహశాస్త్రి సంతోషముతో "ఆ కాంచనాంగి సూర్య శక్తియగు హిరణ్మయి. ఆమె అగ్నిని ధరించును. ఆమె దానిని నీ చేతి యందుంచుట వలన నీకు అగ్ని యంశముతో పుత్రుడు కలుగునని తోచుచున్నది" అని ఆమెను అభినందించెను.
- ↑ * (ప్రథమ ప్రకరణము - ప్రాదుర్భావము)