అట్లే ఆమె అక్కడి నుండి వచ్చిన తరువాత గర్భవతి అయ్యెను. ఏడవ మాసము రాగానే ఆమెను పుట్టింటికి పంపి నరసింహశాస్త్రి ఇష్ట దేవతానుగ్రహమును సంపాదించుటకు కాశికి పోయెను. అక్కడ ఆయన కార్తీక మాసారంభము నుండి డుంఠి గణపతి ఆలయములో పగలు ఉపవసించుచు రాత్రి పాలు త్రావుచు జపముచేయ జొచ్చెను. ఒకనాడు మధ్యాహ్నమున రెండు గంటలకు ఒక శిశువు గణపతి విగ్రహము నుండి వచ్చి అభిముఖముగా అంతర్ధానమైనట్లు ఆయనకు గోచరించెను. ఆ దేవుని యనుగ్రహమున తనకు పుత్రుడు కలిగి యుండునని తలంచి సంతోషించుచు ఆయన అత్తవారింటికి వచ్చెను. తన యొద్దకు దివ్యశిశువు వచ్చిన సమయముననే బహుధాన్య కార్తీక బహుళాష్టమి యందు భానువాసరమున 17 - 11- 1878 మఖా నక్షత్ర ప్రథమ పాదమున పుత్రుడు కలిగెనని చెప్పిరి. పుట్టిన బిడ్డచుట్టు దివ్యమైన తేజస్సు తనకు గోచరించెనని నరసమాంబ చెప్పెను. అందరును సంతోషించిరి. తమ యిష్ట దేవతల నామములతో దంపతులు పుత్రునకు సూర్య గణపతి శాస్త్రి అని నామకరణ మొనరించిరి.
దైవాంశసంభూతు డయ్యును బాలుడు దివ్య లీలలను ప్రదర్శింపక పోగా రోగగ్రస్తు డగుట బంధువుల పరిహాసమునకు తల్లిదండ్రుల పరితాపమునకు కారణ మయ్యెను. ఆరేండ్లు వచ్చినను బాలునకు మాటలు రాలేదు. ఎన్నో చికిత్సలను చేసి విసిగి తుదకు నరసింహశాస్త్రి వానికి కాల్చిన లోహమును నాడీ బంధము నందు తాకించెను. అడ్డు తొలగించి నంతనే ఉబికివచ్చు ప్రవాహము