పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రామాధిపత్యము సంక్రమించెను. జగన్నాథ శాస్త్రి కుమారుడు భీమశాస్త్రి. భీమశాస్త్రికి నరసింహ శాస్త్రి, సర్వేశ్వర శాస్త్రి యను పుత్రులు కలిగిరి.

నరసింహశాస్త్రి కుటుంబమునకు, గ్రామమునకు ఆధిపత్యమును వహించుచు ఆయుర్వేద జ్యోతిష మంత్ర శాస్త్రము లందు విశారదుడై చుట్టు ప్రక్కల గ్రామములలో వ్యవహారవేత్తగా ప్రసిద్ధుడయ్యెను. శ్రీవిద్యా దీక్షను పొందిన వీరి వంశస్థులలో ఈయన యైదవ పురుషుడు. ఈయనకు డుంఠి గణపతి, భార్యయగు నరసమాంబకు సూర్యుడు ఇష్ట దేవతలు.

విప్లవము నాటికి నరసింహశాస్త్రి కుఱ్ఱవాడు. ఆ సమయమున ఈయన దేశ సంచారము చేయుచుండెను. విప్లవము నణంచు నెపముతో తెల్లవారు కావించుచుండిన ఘోరకృత్యములను దారి పొడవున చూచుచు ఈయన చాల ఖేదమును పొందెను. నాటినుండి దేశ స్వాతంత్ర్యము కొఱకు ప్రజల యభ్యుదయము కొఱకు ఈయన ఉపాయములను ఆలోచింప జొచ్చెను. వేద దర్మము నుండి ప్రజలు జారుచుండుటయే వారి దౌర్బల్యమునకు దేశ దుర్గతికి హేతు వయ్యెనని ఆయన తలంచుచుండెను. కాని సనాతనమైన ధర్మమును నెలకొల్పుటకు తనకు శక్తి చాలదని అట్టి సామర్థ్యముగల పుత్రుని అనుగ్రహింపుమని ఆయన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థించు చుండెను. నరసమాంబ కూడ భర్త ననుసరించి మంత్ర జప స్తోత్రములను ఆరాధనలను చేయ జొచ్చెను.