1934 ఫిబ్రవరిలోనో, మార్చిలోనో నాయన శిరసి వీడవలసి వచ్చెను. కలువఱాయికి చేరి ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయ వార్షికోత్సవములకు విశాఖపట్టణమునకు పోయి భారత చరిత్ర పరీక్షను గూర్చి రెండు ఉపన్యాసములు గావించెను. ఆ యుపన్యాసములకు ముగ్దులై విశ్వవిద్యాలయము నందు ప్రాచీన విద్యా పరిశోధనల శాఖలో నాయనను చేర్చుకోవలయునని చాలామంది యాచార్యులే (Professors) కాక వైస్ చాన్సలరుగా నున్న సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు కూడ తలంచెను. కాని వాసిష్ఠుడు తపోవృత్తిని వీడుటకు ఇష్ట పడ లేదు.
కలువఱాయిలో మహాదేవుడు తండ్రి కొఱకు మామిడి తోటలో కుటీరమును సిద్ధ మొనరించెను. అందులో చేరుటకు 14-9-1934 తేది శుభ దినముగా నిశ్చయింపబడెను. కాని మహాదేవునకు రైల్వేలో ఉద్యోగమును చూపింతుమని ఆశ చూపి శ్రీ మరువాడ ప్రసాదరావు ఆ శుభ దినముననే నాయనను గైకొని ఖడ్గపురమునకు బయలు దేరెను.
మహాదేవుడు కూడ పండితుడు, కవి. 'వాసిష్ఠ' అను పేరుతో ఈయన తండ్రిగారి యసంపూర్ణమైన నవలను 'పూర్ణ' ను పూర్తిచేసినాడు. ఈయాన 'వృషాకపి', 'భోజనస్థానము' మొదలగు గద్య రచనలను, 'తోవూరుయుద్దము', 'అపర్ణ' మొదలైన నవలలను వ్రాసినాడు. ఈయన పద్య రచనము నందుకూడ సిద్దహస్తుడే. గణపతి స్తవము, ప్రహ్లాద చరిత్రము మొదలుగా పెక్కు కావ్యముల నీయన రచించినాడు. తంజావూరు సరస్వతీ మహలులో తెలుగు రీసెర్చి పండితుడుగా పనిచేయుచు విప్రనారాయణ చరిత్ర మొదలైన గ్రంథాలను సంపాదించి (Editing) ప్రకటించినాడు.