పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

గ్రామ కైఫీయత్తులు

వాక్యనిర్మాణము

కైఫీయతులలోని వాక్యముల నిర్మాణములలో విశేషము లంతగా లేవు. గారుతో కూడిన శబ్దములు కర్తలుగా నున్నపుడు సాధారణముగా క్రియను, బహువచనమునందు వాడుట పరిపాటి, కైఫీయతులలో నట్టిచోట్ల కృష్ణనింగారు చేశెను, పంతులుగారు చేశెను, అని క్రియ ఏకవచనమునందే వాడబడినది. తమ్ములయ్ని జగ్గయ్య అప్పారాయునింగారు ప్రభుత్వం చేశెను, అనుచోట కూడ ఏకవచనమే వాడబడినది. క్త్వార్థకక్రియయు ప్రధానక్రియయు, ఏకకర్తృకములు కాని కొన్ని ప్రయోగములున్నవి. అట్టిచోట్ల క్త్వార్థకము హేత్వర్ధమున వాడబడినదని భావింపవలయును.

వర్ణక్రమదోషములు, అన్యదేశ్యపదములు, ఇష్టము వచ్చిన ట్లచ్చులను లోపింపజేయుట అను వాని మూలమున కైఫీయతులలోని భాష కొంత వింతగా కనిపించును. అచ్చటచ్చట అన్వయదోషములు కూడ కనబడుచుండును. కాని శ్రద్ధగా పఠించినచో నివి యాకాలమునందు ప్రజల వాడుకలో నుండిన భాషాస్వరూపమును, తేటతెల్లము కావించుననుటలో సందేహములేదు. దీనికి తోడు, వానివలన, ఆయా గ్రామములకు సంబంధించిన స్థలపురాణములను, దేవతలను, పరిపాలకులను కూర్చి, తెలిసికొనుటకు కూడ అవకాశముండును. వీనియందు వివరింపబడిన చరిత్రాంశములను ప్రమాణాంతరములచే నిర్థారణము చేసికొనుట మంచిది.

——దివాకర్ల వేంకటావధాని