పుట:GUNTURU THALUKA GRAMA KAIFIYYATHULU-2005 (VOL-1).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కైఫీయతులందలి భాష

31

కైఫీయతులలో నచ్చటచ్చట జమీందారులయు, ధనికులయు, నామములు కానవచ్చుచుండును. మన మిప్పు డట్టివారినామముల తరువాత ప్రథమావిభక్తిమీదనే గారు, వారు అను గౌరవవాచకములను వాడుచుందుము. కైఫీయతులలో భాస్కరునిగారు, పద్మనాభునిగార్కి, మాణిక్యారాయునింగారు, అప్పారాయునింగార్కి, మున్నగు ప్రయోగములలో నాగౌరవవాచకములకు ముందు “ని” లేక “నిం” అను వర్ణములు కానవచ్చుచున్నవి. కృష్ణనింగారు అనుచో నిం అనుదానికిముం దత్వమే ఉన్నది.

'

సర్వనామములు

నీవు, నేను, వాడు, వారు, నేను, మేము, అది, అవి, అను సర్వనామములు కైఫీయతులలో గ్రంథములం దున్నట్లే కనబడుచున్నవి. వానిని అను ద్వితీయావిభక్తి రూపమునకు వాణ్ని అను రూపము వాడబడినది. జడవాచకములకు వాటికి, వాటిని, అను రూపములు వాడబడినవి. వారికి, అనుచో ఉపోత్తమేత్వము లోపించినవార్కి అను రూపమును, ఆయన అనుదానికి అయ్న అను రూపమును అచ్చటచ్చట వాడబడినవి. అతడు అనుటకు అతను అను రూపము కనబడుచున్నది. ఉదా:- అనేటి, అతను

సమాసములు

కైఫీయతులలో సంస్కృతాంధ్రపదములును, సంస్కృత అన్యదేశీయుములును, కలసిన సమాసములు తఱుచుగా వాడబడినవి. ఆంజనేయగుడి, గ్రామకరిణీకము, క్షత్రియకన్నియ, బహుగొప్ప, కాపురస్తులు, గ్రామమిరాశి, గ్రామచెఱువు, గ్రామగుడి, గ్రామకట్టుబడి, గర్భగుడి, ప్రతిరోజు, అనేకమంది మున్నగు సమాసము లిందుకు నిదర్శనములు. ఒకచోట విఘ్నేశ్వరుడి గుడి అని ప్రయోగమున్నది. ఇచ్చట నిగాగమమునకు బదులు, “డి” వర్ణము ఆగమముగా వచ్చినది. ఒక్కచో మంత్రాక్షింతలు అను ప్రయోగము కలదు. అక్షతలు అను పదమే వాడుకలో, అక్షింతలు అని వినబడుచుండును.

సంఖ్యావాచకములు

పద్దెనిమిది, పద్నాలుగు, ఇరువై, అను ప్రయోగములు అచ్చటచ్చట నున్నవి. ఒకచోట ఎనభయ్యి నాలుగు, అని యకారద్విత్వముతో కూడిన ప్రయోగము కలదు. నూటయాభై అనుదానిలో ఏబది యాభైగా మారినది. నూరు అనురూపము. రెండు మూడు చోట్ల కలదు.

అన్యదేశ్యములు

కైఫీయతులలో అచ్చటచ్చట, ఆంగ్లపదములును, హిందీ, ఉర్దూ, పారశీక, పదములును కానవచ్చుచున్నవి. అమాని, మామ్లియతు, సదరహి, దరోబస్తు, బేదఖలు, కమామీసు, లగాయతు, (లగాయతీ), మొఖసా, కసుబా, శిఫార్సు, దాఖలు, కుంఫిణి, కల్ కటరు, రిమార్కు, మైనరీ, మున్నగు పదము లిందుకు దృష్టాంతములు.