పుట:February 2020.అమ్మనుడి.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వినియోగించుకొనే భాషలు మాత్రమే భాషల పోటీలో ముందడుగు వేయగలుగుతాయి.

. . .

అమ్మనుడుల వికాసంతోనే ఆయా భాషజాతుల వికాసం ఉంటుంది. వికాసం అంతా వినియోగంపైనే ఆధారపడి వుంటుందని పదేపదే చెప్పుకోనక్కర లేదు. ఈ సత్యాన్ని గుర్తించక, తమ భాషను అన్ని విధాలా వినియోగించుకోవడం మాని, బానిసత్వ భావజాలంతో, ఆత్మ విస్మృతితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు తమకున్న ప్రత్యేక రాజకీయ లక్ష్యాలకోసం, ప్రజల్ని మోసం చేయడానికి పూనుకొంటున్నాయి. ఇటువంటి ధోరణిలో ఉన్న ప్రభుత్వాల్లో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మొదటి స్థానంలో ఉన్నాయి. వాటిలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పట్టుదలగా ముందుకు సాగుతున్నదనడంలో సందేహమే లేదు. ఈ సంగతి ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్ధమవుతున్నది. ఈ విషయంలో జాతి ఉనికికీ, అభివృద్ధికీ, భవితకూ గొయ్యి తవ్వుతున్న మన రాష్ట్ర పాలకుల్లో గత ప్రభుత్వ నేతలు వెన్నుపోటు పొడిస్తే, నేటి పాలకులు ఎదురుపోటు పొడుస్తున్నారు. శాసనసభ చర్చల్లోనే మాజీ ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి చేసిన ప్రసంగాలను, పరస్పర ఆరోపణలను గమనిస్తే ఆంగ్ల సేవలో వారెంత పోటాపోటీగా పుణీతులగుతున్నదీ అర్ధం చేసుకోవచ్చు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని రద్దుచేసి, పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంపై ప్రజాహిత వ్యాజ్యాల విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలను పరిశీలిస్తే మనకు పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది.

కోర్టు తీర్పు ఫిబ్రవరి నెలలో - బహుశా అమ్మనుడుల పండుగకు లోపే వెలువడవచ్చునని అనుకొందాం. ఆ తీర్పు ఎలా వచ్చినా, మన రాజకీయ నేతలు బుద్ధి తెచ్చుకొని ప్రజా శ్రేయస్సును, జాతి శ్రేయస్సునూ తలపెడతారని మనం ఆశలు పెట్టుకోనక్కరలేదు. మనం గతంలోనే ప్రస్తావించుకొన్నట్లు - అమ్మ నుడులలో విద్యా బోధన, ప్రజలభాషల్లో పరిపాలన అనే అంశాలపై జాతీయ విధానాన్ని రూపొందించి అమలుకు తెచ్చే విధంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమాలు చేయాలి. ఈ చైతన్యాన్ని ప్రజల్లో నిర్మించేందుకు సమాలోచనలు సాగాలి. అప్పుడే - ముఖ్యంగా మధ్య తరగతి, వెనుకబడిన వర్గాల ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఎక్కువ తక్కువ భావనలకు తావిచ్చే విద్యకు స్వస్తి చెప్పి అందరికీ సమానమైన విద్యను అందించాలి. పాఠశాల విద్య అంతా - ఉచితంగా అందరికీ అందించేందుకు నిర్ణయాలు జరగాలి. ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో కూడా మాతృభాషల్లో చదువుల అవసరం పూర్తిగా ఉండాలి. భాషల్ని సమకాలీన అవసరాలకు తగ్గట్లు అభివృద్ధి చేసేందుకు కూడా చురుగ్గా పనిసాగాలి. సామాన్య ప్రజలు ప్రభుత్వాలను, వాటి నేతలను సమర్ధంగా ఎదుర్కోవడానికి మాతృభాషల సాధికారిత తప్పనిసరి.

. . .

ఈసారి రానున్న 'ఎల్లనాడుల (అంతర్జాతీయ) అమ్మనుడుల పండుగ (మాతృభాషా దినోత్సవం) మన ముందు కొత్త సవాళ్లను, ఆశలను ఉంచుతున్నది. దేశంలోని ప్రజాభాషలన్నిటి ముందు ఈ పరిస్థితి ఉంది. అయితే - ప్రత్యేకించి తెలుగు భాషా జాతీయులందరి ముందు ఇది అత్యవసరంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే - భాషా రాష్ట్రాల మనుగడను, ప్రజాభాషల అవసరాన్ని మన బిడ్డలే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. 'సరళీకరణ, ప్రయివేటీకరణ, అంతర్జాతీయకరణ' సిద్ధాంతాన్ని ఎదుర్కొని - స్థానిక, దేశీయ శ్రేయస్సు తర్వాతే ప్రపంచ శ్రేయస్సు అనీ, ప్రజల భాషల గౌరవంతోనే ప్రభుత్వాల అస్తిత్వం అనీ, మానవుణ్ణి గుర్తించడంతోనే సమాజ ప్రగతి, దేశ ప్రగతి, ప్రపంచ శాంతి నెలకొంటాయని అందరికీ తెలియాలి. ముఖ్యంగా పాలక వర్గాలకు అర్ధం కావాలి.

అమ్మనుడుల భద్రతకూ, వికాసానికి ఉద్యమాలే ఆధారం. ప్రజల భాషలను గుర్తించడం, గౌరవించడం అంటే మనిషిని గుర్తించడం. సొంత భాషతోనే కదా మానవ వికాసం! 'నన్ను నాకు యజమానిగా నిలబెట్టేదే నా భాష' అని కవి నినదిస్తున్నదందుకే.

తేదీ : 30-1-2020 తెలుగుజాతి పత్రిక అమ్మనుడి • ఫిబ్రవరి-2020