పుట:February 2020.అమ్మనుడి.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిర్ధారణ. వాటిని అధ్యయనం చేయవలసిన ఆవశ్యకతపై “'సమగ్రము, నిర్దుష్టమూ అయిన ద్రావిడ భాషా చరిత్ర రాయడానికి అనాగరిక భాషా సామగ్రి అవసరం. కొండ భాషా పదానికి అర్ధం తెలుగు పదం వల్లనే చాలావరకు తెలుస్తుంది. సాహిత్యం విషయంలో ఈ భాషలకు ప్రాధాన్యం లేకపోయినా, భాష పారిశ్రామిక సమాజాలలో వలె వేగంగా మారదు. అన్ని ద్రవిడ భాషలలో జారిపోయిన ర, బండి ఱ అక్షరాల ఉచ్చారణ భేదం కొండభాషలో నిలిచి ఉండటం దీనికి తార్మాణం” అని భద్రిరాజు పేర్కొన్నారు. “లిపి లేకపోయినా గోండి భాష చాలా పరిపుష్టమైన సుందర భాష ' అని సుబ్రహ్మణ్యం అభిప్రాయం. భాష ముందు, లిపి తరువాత. భాషతో పాటు సాహిత్యం కూడా ఉంటుంది. అవి పరిశోధకుడి కృషిని బట్టి లభిస్తాయి. మానవ శాస్త్రవేత్త హైమెండర్భ్‌, మైకేల్‌ యార్క్‌ గోండి సాహిత్యం రికార్డు చేసినందువల్ల గోండి “సాహిత్యం విషయంలో ప్రాధాన్యత గల ' 'పరిపుష్టమైన భాష అని ' తెలిసింది. అదే హైమెండర్స్‌ చెంచులను, కొండరెడ్లను అధ్యయనం చేసినా, వారి సాహిత్యం సేకరించలేదు. అంటే ఈ తెగలకు 'పుష్టి 'గల సాహిత్యం లేదని కాదు. భద్రిరాజు గురువు ఎమనోవ్‌ నీలగిరి తోడా తెగవారి పాటలు కూడా సేకరించారు.

తెలుగు గిరిజన భాషా మాండలికం

భద్రిరాజు కొండదొరల కువి భాషను అధ్యయనం చేసిన అరకు ప్రాంతం పక్కనే గల పాడేరు, చింతపల్లి గూడెం ప్రాంతాలలో కొండదొరలు, బగతలు, వాల్మీకులు, కొండ కమ్మరులు తెలుగే మాట్లాడతారు. కొండ కుమ్మరులు తెలుగే మాట్లాడతారు గాని ప్రభుత్వం వారిని తెగగా గుర్తించలేదు.

సేకరించిన కథల నుండి నెలలు, పండుగలు, వివాహ పద్ధతులు భద్రిరాజు పేర్కొన్నారు. ఈ పండుగ గేయగాధలు, సాహిత్యం ఈ తెలుగు ప్రాంతాలలో దొరికాయి. విశాఖ మన్యం పక్కన గల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కొండ ప్రాంతాలలో కాొండరెడ్లు, వాల్మీకులు, కొండకమ్మరులు నన్నయ యుగం తెలుగు మాట్లాడతారు. వీరిమధ్య, పొరుగున ఉన్న కోయలది గోండి మాండలికం. నల్లమలలో చెంచులు, ఆ మలలకింద ఉండే యానాదులు మాట్లాడేది, తెలంగాణంలో గల నాయకపోడు తెగ మాతృభాష తెలుగే.

“దుర్గమాలైన మహానదులు, పర్వత పంక్తులు, అరణ్యాలు, రెండు భాషా ప్రాంతాలను వేరుచేస్తూ ఆయా వ్యవహర్తల రాకపోకలకు ఆటంకాలుగా ఉన్నంత వరకు, అవి కూడా భాషా మండలాలకు సరిహద్దులౌతాయి. ఇటీవల రాకపోక సౌకర్యాలు పెరిగి పరిస్థితి కొంత మారినా, పూర్వచరిత్రలో ఏర్పడ్డ మాండలిక భేదాలు అంత తొందరగా మాసిసోవు” అని నిర్వచించిన శాస్రజ్జులు, కొత్త భాష మోజులో ఈ తెగ తెలుగుమీద దృష్టి సారించలేదు. మాండలిక వృత్తి పదకోశాలు తయారు చేసేటప్పుడు కూడా ఈ తెలుగు తెగల ప్రస్తావన లేదు. ఆ ప్రాంతాలకు పోలేదు. ఇటీవల మాతృభాషలో విద్యాబోధన కోసం వాచకాలు తయారు చేసినప్పుడు కూడా తెలుగు మాండలికం మాట్లాడే తెగలను పట్టించుకోలేదు.

భాషా పరిశోధకులు - సాహిత్య సేకరణ విశ్లేషణ

కానీ ఆ తెగల సాహిత్యం సేకరించిన పరిశోధకులు తమకు చేతనైనంతవరకు భాషా విశేషాలు కూడా పేర్కొన్నారు. భాషా శాస్త్రం కుదురు నుంచి రూపుదిద్దుకున్న సాహిత్య నిర్మాణ విధానం (struturalism) లోని జ్ఞానం, సంజ్ఞానం (cognition), అర్ధ పరిణామం (semantic domain), నమ్మకాల దొంతరలు (belief system) వంటి వివిధ కోణాలను ఆవిష్కరించి, ఈ తెగలు తెలుగు సంస్కృతి పునాది శిలలని నిరూపించారు. కొండరెడ్లు, చెంచులలో యువతరం సంప్రదాయ సాహిత్యాన్ని సేకరించి ప్రచురించారు. అంతేకాదు భాషా శాస్త్రవేత్తలు కూర్చిన వృత్తి పదకోశాలను శాస్త్రజ్ఞులకు సంప్రతింపు గ్రంథాలుగా, పాఠ్యపుస్తకాలుగా తీర్చిదిద్దుతున్నారు.

భాషా శాస్రజ్డులు మధ్య ద్రావిడంలో తెలుగేతర భాషల మీద పని చేస్తే, సాహిత్యవేత్తలు తెలుగు మాండలికం మాట్లాడే తెలుగు తెగల మీద పనిచేసారు. మానవ శాస్త్రవేత్తలు అన్నితెగల మీద ఎత్నోగ్రఫిలు తయారు చేసారు. ఈ మూడు విభాగాలలో జరిగిన కృషికి సమగ్ర రూపం ఇస్తే, తెలుగు భాష ప్రాచీనతతో పాటు, విస్తృతి కూడా వెలుగు చూస్తుంది. మధ్యద్రావిడ భాషల పదసంపదతో కూర్చిన తెలుగు వ్యుత్పత్తి పదకోశం తులనాత్మక అధ్యయనాన్ని సుగమం చేస్తుంది.

విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలలో తెలుగు గిరిజన భాషా మాండలికం మాట్లాడే కొండదార, బుగత, కొండరెడ్డి, వాల్మీకి, కమ్మరి, కొండకాపుల మాండలికంలో విశేషాలను, సాహిత్య నిర్మాణంలో సూత్రాలను వారిమీద ఈ రచయిత అధ్యయనం 'తెలుగు గిరిజన గీతాలు ' పరివర్దిత ముద్రణ “కొండకోనలో తెలుగు గిరిజనులు” ఆవిష్కరించింది. 'కొండ (తెలుగేతర) భాషా పదానికి అర్ధం తెలుగు పదం వల్లనే చాలావరకు తెలుస్తుంది ' అన్న భద్రిరాజు పరిశీలన ఈ అధ్యయనం అవసరాన్ని నొక్కి చెప్పింది. అలాగే తెలుగు పదాలు / వాడుకలు తెలుగేతర భాషలు, ఆచారాలు తెలిస్తే బాగా బోధపడతాయి.

విశాఖ, ఉభయ గోదావరి జిల్లా తెగల తెలుగు మాండలికం తీరు తెన్నులు

గిరిజన ప్రాంతాల తెలుగు మాండలికవు తీరుతెన్నులను నాలుగు భాగాలుగా పరిశీలించవచ్చు.

వర్ణసంబంధి : ప్రమాణ భాషకు గల వ్యాప్తి గిరిజనుల వ్యవహారంలో అధికంగా కనిపించదు. మాండలిక ప్రభావం తెగలవారీగా మారుతుంటుంది. ఉదాహరణకు కొన్ని మాత్రమే ఇక్కడ స్వీకరించడం జరిగింది. వీటిని ధ్వని మార్పులు, ఉనికి ఉచ్చారణ మార్పులుగా విడదీసి చూడవచ్చును.

1) ఉభయ గోదావరి జిల్లాల్లో కొండరెడ్ల మాండలికంలో ధ్వని మార్పు :

అ అయి (ఐ) ప్రమాణ భాష - గిరిజన భాష వస్తాను -... వైతాను

22

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020