పుట:February 2020.అమ్మనుడి.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


“ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ పార్టీ ' ని స్థాపించిన కోటిపల్లి సుబ్బారావుగారు "

పదేళ్లుగా తెలుగు భాషొద్యమంలొ చురుకుగా పాల్గొంటున్న శ్రీ కోటిపల్లి సుబ్బారావు మాతృభాష తెలుగుకోసం ఎంతటి కృషి చేయడానికైనా సిద్దపడే పట్టుదల గల వ్యక్తి. 'నాబార్డు'(జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు) లో డెప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా పదవీ విరమణ చేసి, ప్రజాహిత కార్యరంగంలో తక్కిన జీవితాన్ని తనను తాను అంకితం చేసుకొన్నారు. విశేషంగా అధ్యయనం చేసిన విద్వాధికుడు బి.ఎస్‌.సి, ఎల్‌.ఎల్‌.బి, ఎం.ఎ. ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు ఆర్కియాలజీ, ఎం.ఎ. (తెలుగు), ఎం.ఎ (జ్యోతిషం) - ఇవీ సుబ్బారావుగారి విద్యార్దతలు. వాస్తు రంగంలో గ్రంథరచయిత. తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్వహణలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలబడుతున్నారు.

ఒక రాజకీయ పార్టీని స్థాపించి పోరాడితేనే తప్ప, మన ప్రభుత్వాలు పట్టించుకోవనే ఆలోచనతో

ఆయన ఇప్పుడు 'ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ పార్టీ 'ని స్థాపించారు. భాషా ప్రాతిపదికపై

విశాల తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండీ మన నాయకులు ఏ విధంగా పాలనలో, విద్యారంగంలో తెలుగును పట్టించుకోకుండా ఎంత ద్రోహం చేస్తున్నారో ఆయన పూసగుచ్చినట్లు చెప్పగలరు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీని స్థాపించడంలో కూడా ఆయన ప్రధాన లక్ష్యం - విద్యా, పాలనా రంగాల్లో తెలుగును అత్యంత ఉన్నత స్టితికి తీసుకువెళ్ళాలనే. ఇందుకోసం ప్రజల్లో స్వాభిమానాన్ని పట్టుదలను పెంచాలని ఆయన కోరుతున్నారు. తగిన వ్యూహాల్ని కార్యక్రమాన్ని చేపట్టి రాజకీయ రంగంలోని వివిధ పార్టీలకూ, వాటి నేతలకూ కదలికను కలిగించి, వారి గుండెల్లో గుబులు పుట్టించే పరిస్థితుల నిర్మాణానికై తమ పార్టీ పని చేస్తుందనీ కోటిపల్లి సుబ్బారావుగారు ప్రకటిస్తున్నారు. ఆయనలోని నైతిక బలం తిరుగులేని శక్తిని ఆయనకు కలిగిస్తున్నది. ఆయన ఆలోచనలను తెలుగు ప్రజలు సమర్ధించాలి. మద్దతునివ్వాలి. సుబ్బారావు గారికి విజయాన్ని కాంక్షిస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -సంపాదకుడు.

వేమనను 'తెలుగుజాతి కవి 'గా ప్రకటించాలి


ప్రజాకవి వేమనను 'తెలుగుజాతి కవి 'గా ప్రకటించాలి అని తెలుగుభాషోద్యమ సమాఖ్య జాతీయ అథ్యక్షుడు డా॥ సామల రమేష్‌బాబు విశాఖపట్టణంలో జనవరి 2018న సమైక్యభారతి ఆధ్వర్వాన జరిగిన ఒక సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. హేతువాది, తెలుగువారిని అభ్యుదయ మార్గంలో నడుపడానికి తేట తెలుగులో అందరి నోళ్లలో నడయాడే విధంగా పద్యాలను అందించిన ప్రజాకవి వేమన అని అన్నారు. ఆయనను తెలుగుజాతి కవిగా ప్రభుత్వం ప్రకటించి పొరుగు భాషల వారివలె మనమూ ముందడుగు వేయాలని ఆయన అన్నారు. 2006 లోనే తిరుపతిలో జరిగిన తెలుగు బ్రహ్మొత్సవాలలో తాను ఈ విన్నపాన్ని వేలాదిమంది పాల్గొన్న సభలో ప్రకటించగా అందరూ సంతోషంగా ఆమోదిం చారని, దీనిని నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కీ.శే. రాజశేఖరరెడ్డి గారికి తెలుగుభాషోద్యమ సమాఖ్య సంస్థాపక అధ్యక్షుడు కీ.శే. సి. ధర్మారావుగారి ఆధ్వర్యంలో సమాఖ్య ప్రతినిధి బృందం నివేదిం చిందని సభకు తెలియజేశారు.

విశాఖపట్టణం కేంద్రంగా రాష్ట్రంలోని పలు తావుల్లో తరచూ సభలు నిర్వహిస్తూ తెలుగుభాషా సంస్కృతుల ప్రచారానికై పనిచేస్తున్న సామాజిక చైతన్య సంస్థ “సమ్టైక్యభారతి” పి. కన్నయ్య మాట్లాడుతూ జనవరి 18న వేమన జయంతితోపాటు శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం, నందమూరి తారకరామారావు నిర్వాణం కూడా ఆ రోజున కలిసి వచ్చినందున, మూడు సందర్భాలనూ కలిపి “తెలుగు మహనీయుల స్మరణీయ మహోత్సవం " పేరిట నిర్వహిస్తున్నామని ప్రకటించారు. సభకు రచయిత శ్రీ మేడా మస్తాన్‌ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధిగా ఎం.ఎల్‌.సి. శ్రీ. పి.వి.ఎన్‌. మాధవ్‌, విశిష్ట అతిథులుగా మాజీ ఎం.పి.డా॥ డి.వి.జి. శంకరరావు, ప్రముఖ మానసిక వైద్యులు డా॥ మోపిదేవి విజయ గోపాల్ , ఆచార్య సి. మంజులత పాల్గొని ప్రసంగించారు.

20

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2020