పుట:February 2020.అమ్మనుడి.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జనసాహితి సాంస్కృతిక సంస్థ పట్టుదలగా ఈ విషయం పై కృషి చేస్తోంది. పాలక రాజకీయ పార్టీలేవీ ఏనాడూ విద్యా వ్యవస్థ పై సరైన దృష్టి పెట్టనేలేదు. కమ్యూనిస్ట్‌ పార్టీలన్నీ సైద్ధాంతికంగా మాతృభాషలో విద్యను నమ్మినా CPIML (జనశక్తి) పార్టీ తప్పితే మిగిలిన ఏ వామపక్ష పార్టీ కూడ పూర్తి స్థాయిలో ఈ సమస్యను తీవ్రంగా పరిగణించలేదు. ఈరోజు కమ్యూనిస్ట్‌ పార్టీల కార్యకర్తలు, అనేక మంది వామపక్ష అభిమానులు కూడా ఈ విషయం పై భిన్నాభిప్రాయాన్ని కలిగి ఉండటం విషాదం. కమ్యూనిస్ట్‌ పార్టీలు బలంగా ఉన్న విజయవాడలోనైనా, వారిలో ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారు? మరి ఇవన్నీ మిగతా సమాజంపై ప్రభావం చూపవా?

ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూదా తెలుగు మీడియమే శాస్త్రీయం కానీ తెలుగు మీడియంలో చదివినవారు ఇంగ్లీష్‌ లో సాధికారికంగా మాట్లాడలేక పోతున్నారు” అంటూ ఇటీవల తాను విడుదల చేసిన ఒక వీడియోలో ఇంగ్లీష్‌ మీడియంను సమర్ధించారు. తాను ఆదిలాబాద్‌ జిల్లాలో తెలుగు మీడియంలో చదువుకున్నానని అయినా ఆంగ్లంలో చక్కగా సంభాషించడమే కాక అనేక ఆంగ్ల పత్రికలలో వ్యాసాలు రాస్తుంటానని, ఇంగ్లీష్‌ టి.వి. ఛానల్స్‌ లో మాట్లాడుతుంటానని ఆ వీడియాలోనే చెప్పారు. తెలుగు మీడియంలో చదివినవారు ఆసక్తి పట్టుదల ఉంటే ఇంగ్లీష్‌ భాషలో దిట్ట కాగలరనదానికి ఆయనే ఒక ఉదాహరణ. కానీ అభ్యుదయ వాది, శ్రామిక వర్గ పక్షపాతి అయిన నాగేశ్వర్‌ గారు కూడా అసమంజసమైన వాదనను తీసుకురావడం దురదృష్టం. 'తిలాపావం తలో పిడికెడు ' అన్నట్లుగా తమ సొంత భాషలో తెలుగు పిల్లలు చదువుకోలేని దుస్థితికి ఎంతోమంది తలొక చెయ్యి వేశారు.

తెలుగు మీడియంలో తమ బిడ్దలను చదివించుకోవాలను కొన్న తల్లిదండ్రులకు చాలా కాలం నుండి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. పట్టణాలలో మున్సిపల్‌ స్మూళ్లలో మినహా తెలుగు మీడియం లో చదివించుకొనే అవకాశం లేదు. కొద్దిగా ఆర్ధిక స్తోమత కలిగిన వారెవ్వరూ ఈ స్నూళ్లలో చదివించడానికి

పల్లెటూళ్లలో రెండు భాషా మాధ్యమాలలో పాఠశాలలు ఉండేవి. కార్పొరేట్‌ స్కూళ్లు పల్లెటూళ్లలోకి పాకిన ప్రస్తుత కాలంలో తెలుగు మీడియం బడులన్నీ కూడ దాదాపు అంతరించిపోయినాయి. మా ఊరిలో ఒకే ఒక ప్రైవేటు స్కూల్లో తెలుగు మీడియం ఇంకా మిగిలి ఉంది.

తెలుగు మీడియంను ఎవరు బలపరుస్తున్నారు?

ఆడుతూ పాడుతూ పిల్లలు విజ్ఞానాన్ని నేర్చుకోవాలని, శిక్షణ శిక్షగా ఉండకూడదని, పిల్లల సృజనాత్మకతను పెంచే విధంగా నాణ్యమైన విద్యను తెలుగు పిల్లలకు అందించాలని భావించే - బాల్యాన్ని ప్రేమించే వ్యక్తులు, తెలుగుభాష మీద అభిమానం ఉన్న వ్యక్తులు, తెలుగు భాషోద్యమ సమాఖ్యలాంటి సంఘాలు, మన సంస్కృతి నాశనమయిపోతుందని భావించే కాంతమంది గురువులు, బాబాలు! ఈ ఆధ్యాత్మిక గురువులు, బాబాలు మాట్లాడే మాటలు హిందూ మత ప్రచారం వలె ఉండి సాధారణ ప్రజానీకానికి ఇంకా విరక్తి కలుగుతుంది. శాస్త్రీయంగా ప్రచారం చేసే తెలుగు భాషోద్యమ నమాఖ్య లాంటి సంఘాలు, వ్యక్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చగలిగినంత బలంగా లేవు.

ప్రస్తుత పరిస్థితి :

జనంలో ఉన్న ఈ ఇంగ్లీష్‌ మీడియం కాంక్షను చూసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వచ్చే సంవత్సరం నుండి దశల వారీగా తెలుగు మీడియంని తీసేస్తానని ప్రకటించారు. ప్రస్తుతం శాస్త్రీయంగా జరిగే చర్చను ఎవ్వరూ పట్టించుకోకపోగా ఇది కాస్తా భావోద్వేగాల సమస్యగా మారింది. “డబ్బున్న వాళ్ళందరూ ఇంగ్లీష్‌ మీడియంలో తమ పిల్లలను చదివించుకుంటే మేము చదివించుకోవద్దా? మాకు వచ్చిన ఈ అవకాశాన్ని కాలదన్నుతారా?” అని శ్రామిక వర్గం ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలలో ఛాలా కాలం నుండి ఇంగ్లీష్‌ మీడియం ఉంది. ఇప్పుడు కొత్తగా జరిగింది - తెలుగు మీడియంను తీసివేయడం. తమ పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివించాలను కొనే తల్లిదండ్రులకు ఈ తెలుగు రాష్ట్రంలో ఇంక అవకాశం లేదు.

ముగింప్తు:

ఇంగ్లీషు మీడియంలో ప్రాథమిక విద్యను బోధించడం వలన సైన్సు, లెక్కలు నేర్చుకోవడంలో తమ పిల్లలు వెనుక బడినట్లు కొన్ని ఆఫ్రికా దేశాలు గ్రహించాయి. అంతే కాకుండా వారి సాంస్కృతిక మూలాలకు కూడా దూరమైనట్లు వారి అధ్యయనంలో తేలింది. ఆ తరువాత మళ్ళీ పిల్లల సొంత భాషలో బోధించడం మొదలుపెట్టిన తరువాత అదే విద్యార్థులలో ఆత్మ విశ్వాసం, దృడ సంకల్పం, సామాజిక నైపుణ్యాలు పెరిగి వారు ఎక్కువ ప్రతిభను కనబరిచారు. ఇది ఐక్యరాజ్య సమితి వారి అధ్యయనం. శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్వితీయ ప్రగతిని సాధించిన అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీ, ప్రాన్స్‌, స్వీడన్‌, రష్యా కొరియా, చైనా వంటి ఏ దేశంలోనైనా ప్రాథమిక విద్య మొదలుకొని, పరిశోధనా స్థాయి వరకు వారి మాతృభాషలోనే జరగడం నేడు కళ్ళకు కట్టుతున్న వాస్తవం. పరభాషా మాధ్యమంలో జోధన వలన సేవా రంగంలో కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి కానీ కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుకే పోయినట్లు విద్యార్థుల సృజనాత్మకత నశించి “ఉత్పత్తి రంగం” కుంటుపడుతుంది.

మన రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్మూళ్ళన్నింటిలో ప్రాథమిక విద్య మాతృభాష లోనే బోధించాలనే నిబంధన చేయాలి.ఉన్నత పాఠశాల విద్యలో రెండు మాధ్యమాలు ఉండాలి. అప్పుడు ఎవరి ఇష్టప్రకారం వారు తమకు కావలసిన మీడియంలో తమ పిల్లలను చేర్చడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్టేనని నమ్మకం కలుగుతుంది.

(వ్యాసరచయిత డా॥ రామకృష్ణప్రసాద్‌ కృష్ణాజిల్లా చల్లపల్లిలలో ప్రముఖ వైద్యులు. జనశ్రేయస్సు లక్ష్యంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మెప్పు పొందిన వైద్యునిగా, ఆదర్శ జీవనాన్ని గడుపుతున్న డా॥ ప్రసాద్‌, డా॥ పద్మావతి దంపతులు అనేక ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. )

18

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి -2020