పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

దంపూరు నరసయ్య


సంబంధించిన వ్యక్తులను గట్టిగా అదుపులో ఉంచాలి. ప్రధానంగా వీరివల్లే ప్రభుత్వానికి తలనొప్పి కలుగుతుంది. ఇది అనుభవం ధ్రువీకరిస్తున్న సత్యం.” ఈ మాటలు అక్షరాలా సత్యాలని ఇటీవల జరిగిన ఆందోళనలు నిరూపించడంలేదా? ఇంత తీవ్రంగా విదేశీయుడు తప్ప ఎవరు మాట్లాడారు? లార్డ్ రిప్పన్ వివేకవంతమైన విధానాలను ఎవరు నిరోధిస్తున్నారు? విదేశీయుడు తప్ప. వైస్రాయి సొంత దేశంవారు తప్ప ఎవరు అవిధేయతను రెచ్చగొడుతున్నారు? “భారత ప్రభుత్వానికి ప్రధానంగా అడ్డునిలుస్తున్నవారు విదేశీయులే” అని మహామనీషి అయిన “రెప్రజెంటేటివ్ గవర్నమెంట్” (Representative Government) గ్రంథ రచయిత అనలేదా? అందరికంటే ముందు తమవారినే అదుపులో ఉంచాలని ఈ రచయిత చెబుతున్నాడు కాదా? క్రమశిక్షణా రాహిత్యాన్ని వారే సృష్టించారు. వారే హానికరమైన వ్యక్తులు. వారి ప్రతిపాదనలను, అభిప్రాయాలను ప్రభుత్వం అంగీకరించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిధేయతను రెచ్చగొడ్తారు. వారు చేస్తున్నదే ఈ అలజడంతా. ఈ దేశీయులకు హక్కులివ్వడం వారిదృష్టిలో అమానుషచర్య. వారు ఉద్యోగాలు చేస్తూ అధికారం చెలాయిస్తారు. వారి జీతబత్యాలు విస్తుపోయేంత పెద్ద మొత్తంలో ఉంటాయి. తాము విజేతలమనే భావనతో శ్రేష్ఠమైనదంతా తమకే కావాలి అంటారు. అంతా తామే ఆరగించి ఎంగిలి మెతుకులు దేశీయులకు విడిచిపెడతారు. తమ పూర్వుల ధైర్యసాహసాల తాలూకు గర్వం తలకెక్కించుకొని ఈ దేశ ప్రజలను ఏవగించుకొంటారు. ఈ ప్రజలను “ఛీ, హీనులు” (Damn, Niggers) అని అనడం న్యాయంగానే ఉందని భావిస్తారు.

ప్రజలముందు మా వాదన బలంగా ఉంచామని భావిస్తున్నాము. మా వాదనలో సత్యం ఉంది. మా వాదన విశ్వసనీయమైనది. ఈ ఆందోళన తగ్గు ముఖం పట్టినపుడుగానీ తాముసాగించిన హింస ఎంత అవివేకమైనదో ఆందోళనకారుల తలకెక్కదు. భావాల్లో, భాషలో ఈ హింసా ప్రవృత్తివల్లే ఆందోళనకారులు లక్ష్యాన్ని, ప్రయోజనాన్ని కోల్పోయారు. బ్రాన్‌సన్ తన కలకత్తా ఉపన్యాసంలో వాడిన తీవ్రమైన భాషవల్ల క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఈ పరిస్థితి ఎంతో దయనీయమైనదిగా మేము భావిస్తున్నాము. అతడు ఇంగ్లాండులో ఆందోళనలో పాల్గొనవలసింది; కాస్త ఆవేశం తగ్గి మనసు కుదుటపడడానికి సమయం చిక్కేది. అక్కడి వాతావరణం చల్లగా అనుకూలించేది గదా ! తాను ఎక్కడికి వెళ్ళినా తన ప్రవర్తనలో రవ్వంత ఔదార్యాన్ని చూపలేడు. అవకాశం దొరికినప్పుడల్లా ఐరిష్ జాతీయులు "స్వీట్ బ్లార్నీ” (Sweet Blarney) అని పిలిచే తన ఉపన్యాస ధోరణిని కొనసాగిస్తూ, చికాకు పుట్టించే ఈ పెద్ద మనిషిని మేము క్షమించలేము.”

ఇల్‌బర్ట్ బిల్లుకు వ్యతిరేకంగా యూరోపియన్లు, యూరేషియన్లు ఆందోళన చేసినపుడు దేశీయ పత్రికలు ఈ బిల్లుకు స్వాగతం పలుకుతూ ప్రజాభిప్రాయాన్ని పెద్దయెత్తున