పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

79


ఇతని కన్న మిన్న అయినవారు భారతదేశాన్ని గురించి ఏమనుకుంటున్నారో పరిశీలిద్దాం. భారతీయులను గూర్చి ఎట్లా అభిప్రాయపడుతున్నారో తెలుసుకుందాం. ముందుగా ఇటీవల మన గవర్నరుగా పనిచేసిన ఛార్లెస్ ట్రెవిలియన్‌ ప్రారంభిద్దాం. ఆయన మాటలు గుర్తించుకోదగినవి. “ఇంగ్లాండులో పోటీ పరీక్షలలో నెగ్గలేని నానారకాల యువకులు, ఆ పరీక్షలు రాయడానికి గూడా సాహసించలేనివారు, సిఫారసులు చేతబట్టుకొని భారతదేశానికి వెళుతున్నారు. వీరు పోలీసుశాఖలో నియమించబడుతున్నారు. రెవెన్యూశాఖలో డెప్యూటీ కలెక్టర్లుగా నియమించబడుతున్నారు. ఈ విధానం అన్యాయమైనది.”

పరీక్షలు పాసైన భారతీయ యువకులను ఈ పద్ధతిలోనే నియమిస్తున్నారా? లార్డ్ ట్రెవిలియన్ పేర్కొన్న ఈ పెద్దమనుషులు దేశీయ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించినపుడు వారు ఈ దేశ అవసరాలను ఇంతకన్న మెరుగైన రీతిలో పట్టించుకుంటారని భావించడం దురాశే అవుతుంది. ఈ విషయంలో లార్డ్ లారెన్సు (Lord Lawrence) ఏమంటున్నారో చూడండి.

“ఇంతకన్న విశ్వసించదగిన పదవుల్లో, ఇంకా పెద్ద జీతబత్యాలున్న విధుల్లో భారతీయులు నియమించ దగిన వారని నేను భావిస్తున్నాను. వారు ముఖ్యంగా న్యాయశాఖలో నియమించ దగిన వారు. భారతీయులు మంచి న్యాయాధిపతులుగా తయారు కాగలరని భావిస్తున్నాను.” (ఈ అక్షరాలను ఇటాలిక్స్‌లో మేమే ఉంచాము.) స్థానికులు న్యాయాధిపతులుగా నియమించబడడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నారని భారతదేశంలో విస్తృతానుభవం ఉన్న ఒక గవర్నర్ జనరలు అన్న మాటలివి. బ్రాన్‌సన్ ఆయన సభలో పాల్గొన్నవారు భారతీయులను చొరవలేని మందమతులనీ, పరిశుభ్రత లేనివారనీ భావిస్తారు. సర్ ఛార్లెస్ ట్రెవిలియన్, సర్ లారెన్స్‌ల కంటే చాలా తెలివిగలవారమని వీరు అనుకొంటారు. ఒకప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిన గౌరవనీయులైన డబ్ల్యు. ఎన్. మాసీ (W.N.,Massey) ఎస్. బార్టిల్ ఫ్రెరర్ (S.Bartle Frere) మొదలైన సమర్థుల ముందు, ఉన్నత పదవులు నిర్వహించిన అధికారుల నిశ్చితాభిప్రాయం ముందు బ్రాన్‌సన్, అతని అభిమానుల నిరాధారమైన అభిప్రాయాలు అల్పమైనవిగా, తృణప్రాయంగా కనిపిస్తాయి. వేదికలమీద, పత్రికల్లో రెచ్చగొట్టే ఇటువంటి భావాలను గురించి జాన్ స్టూవర్ట్ మిల్ (John Stuart Mill) చాలాకాలం కిందటే రాశాడు. ఈ వాక్యాలు తరచుగా ఉల్లేఖించబడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చెప్పడంవల్ల ఈ మాటలు తమశక్తిని కోల్పోవు. ఈ రోజుల్లో భారతీయులందరూ ఈ మాటల్లో అర్థాన్ని జీర్ణం చేసుకోవలసిన అవసరం ఉంది. “ఒక దేశాన్ని మరొక దేశం జయించి తన స్వాధీనంలో ఉంచుకొన్నప్పుడు, ఆ దేశసంపదను కొల్లగొట్టి సంపదలు మూటలు కట్టకుండా అందరికంటే ముందు పాలకులకు