పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

దంపూరు నరసయ్య


సంపాదకీయ లేఖలు ప్రచురించబడ్డాయి. ఉత్సవదినాల్లో పుణ్యక్షేత్రాలు దర్శించే యాత్రికులకు ఎస్.ఐ.ఆర్ రైల్వేవారు తిరుగు టిక్కెట్లు ముందుగా ఇవ్వాలని కోరుతూ రాసిన లేఖ ఒకటి. రెండోది తంజావూరు దేవస్థానం ఆదాయవ్యయాలకు సంబంధించిన వివాదంలో ఒక వర్గం వారి లేఖ. ఈ వివాదంలో ఉభయపక్షాలు కొన్ని నెలలుగా పీపుల్స్ ఫ్రెండ్‌కు సంపాదకీయ లేఖలు రాస్తున్నట్లు తోస్తుంది. మూడో పుటలో “టెలిగ్రామ్స్ ఫ్రమ్ డెయిలీ పేపర్సు” (Telegrams from Daily Papers) శీర్షికలో ప్రపంచ దేశాల వార్తలున్నాయి. ఈ వార్తలన్నీ విదేశీ పత్రికల నుంచి పునర్ముద్రించినవే. బ్రహ్మసమాజ నాయకుడు కేశవచంద్రసేన్ ఆరోగ్యాన్ని గురించి స్టేట్స్‌మన్ ప్రచురించిన వార్తను ఈ శీర్షికలోనే ఇట్లా ప్రచురించాడు. “ఈ వార్త విని చాలామంది సంతోషిస్తారు. మహానుభావుడు, బ్రహ్మసమాజ నాయకుడు కేశవచంద్రసేన్ ఆరోగ్యం కాస్త కుదుటపడింది. అయినా ఆయన పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు స్టేట్స్‌మన్ రాస్తూంది. ” లండన్‌లో జర్మన్ కార్యాలయాన్ని పేల్చివేయడానికి ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో పోలీసులు ఒక జర్మన్ జాతీయుణ్ణి అరెస్టు చేస్తారు. అతడు సోషలిస్టని ఆ వార్తలో ఉంది. ఇటువంటి అనేక జాతీయ, అంతర్జాతీయ ఆసక్తికరమైన వార్తలు ఈ శీర్షికలో ప్రచురించబడ్డాయి. కొత్తగా ఉన్నతోద్యోగాలలో చేరడానికి ఇంగ్లాండు నుంచి భారతదేశం వస్తున్న వారి వివరాలు, పదవీవిరమణ చేసిన పెద్ద ఉద్యోగుల వివరాలు ఈ శీర్షికలోనే ఇవ్వబడ్డాయి.

“నోట్స్ అండ్ న్యూస్” (Notes and News) శీర్షికలో భారతదేశ వార్తలు, పండిత రమాబాయి సంక్షిప్త జీవితచరిత్ర ఇవ్వబడ్డాయి. ఇందులో కొన్ని వార్తలు సోదరపత్రికల నుంచి స్వీకరించి ప్రచురించినవి కూడా ఉన్నాయి. ఫోర్ట్ సెంట్ జార్జి గెజిటు నవంబరు 27 మంగళవారం సంచికలోని అనేకవిషయాలు ఈ శీర్షికలో పునర్ముద్రణ పొందాయి. “సెలెక్టు టెలిగ్రామ్స్” (Select Telegrams) శీర్షికలో ఆయా పత్రికల నుంచి ఎంపిక చేసిన వార్తాకదంబం కనిపిస్తుంది. లభించిన ఒకటి రెండు సంచికలను బట్టి పత్రికను అంచనా వెయ్యడం సాహసమే అయినా, సాంఘిక, సామాజిక విషయాలమీద, జాతీయ అంతర్జాతీయ సంఘటనలమీద ఆసక్తి, అవగాహన ఉన్న విద్యాధికులైన సంస్కారులీపత్రికకు పాఠకులని అనిపిస్తూంది.

పీపుల్స్ ఫ్రెండ్ ఉద్యోగులు

పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్ మొదట మద్రాసు వడమాలవీధిలో, 253 నంబరు ఇంట్లో, ప్రారంభించబడింది. రెండేళ్ళ తర్వాత ఆఫీసు నంబరు 355, మింట్ స్ట్రీటుకు మార్చబడింది.25 తొలినాళ్ళలో పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక పనితీరు, ఉద్యోగుల వివరాలు తెలియజేసే "ఆఫీస్ ఆర్డర్ బుక్”లో నరసయ్య స్వదస్తూరితో వేసిన 37 ఆఫీసు ఆర్డర్లు