పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

61

“సహృదయ పాఠకులారా ! పీపుల్స్ ఫ్రెండ్ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతూంది. ఈ పత్రిక యజమాని, సంపాదకుడు పాఠకుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చెయ్యగలిగినంత చేశాడు. దక్షిణ భారతదేశంలో పత్రికా నిర్వాహకులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తేనేతప్ప, పాఠకుల్లో ఉత్సుకతను మేల్కొల్పడం సాధ్యం కాదు. దళసరి కాగితంమీద పత్రికను అచ్చువేయాలనే అభిప్రాయంతో సంవత్సరానికి రెండణాలు అదనంగా చందా చెల్లించమని విన్నవించుకొన్నాము. ఇందుకు మా చందాదారులు ముందుకు రాలేదని చెప్పడానికి విచారిస్తున్నాము. దళసరి కాగితం మీద ముద్రిస్తే పత్రిక ఎంత ముచ్చటగా ఉంటుందో మా పాఠకులు గ్రహించినట్లు లేదు. మాకు పెద్ద సర్క్యులేషను ఉంది. అది రోజు రోజుకు వృద్ధి చెందుతున్నందుకు మేము ఆనందిస్తున్నాము. పాఠకులు మా పత్రికను ఇష్టపడుతున్నారని ఇందువల్ల స్పష్టంగా తెలుస్తూంది. ఎన్నో కష్టనష్టాలను భరించి పాఠకుల అభిప్రాయాలకు అనుగుణంగా పత్రిక సాహిత్య స్వరూపాన్ని (Literary get up) తీర్చిదిద్దుతున్నాము. మేము పెట్టే కర్చులో వ్యాసాలకోసం నెలనెల చెల్లించే మొత్తం కూడా తక్కువేమీ కాదు. అందించగలిగినంత సహాయం అందచేయవలసినదిగా మా మిత్రులను ప్రార్థిస్తున్నాము.”

మూడో పుట సంపాదకీయం కోసం కేటాయించబడింది. ఈ పుటలో రెండు, మూడు 'కాలా'లలో “టూ పిక్చర్స్” (Two Pictures) శీర్షికతో ప్రధాన సంపాదకీయం ఉంది. సంపాదకీయం పై భాగంలో ఆ నెల కేలెండరు, సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ప్రచురించబడ్డాయి. ఇదే పుటలో నాలుగో 'కాలం' గతవారం 'లీడర్' (సంపాదకీయం) తరువాయి భాగం "ది బెంగాల్ టెనెన్సీ బిల్ (The Bengal Tenancy Bill) ప్రచురించబడింది. రచయిత పేరు 'F' అని మాత్రం ఇవ్వబడింది. ఈ సంచికలోనే “సర్ విలియం హేమిల్టన్స్ వ్యూ ఆఫ్ ది థియరీస్ ఆన్ ది బిలీఫ్ ఆన్ ఎక్స్‌టర్‌నల్ వరల్డ్” ("Sir William Hamilton's view of the theories on the belief on external world") వ్యాసం ఉంది. వ్యాసరచయిత సి.పి. దొరస్వామిచెట్టి బి.ఏ. ఇది తత్త్వశాస్త్ర సంబంధమైన వ్యాసం. ఈ సంచికలోనే కనాట్ డ్యూక్ (Duke), డచెస్ (Duchess of Connaught) భారతదేశ పర్యటనకు సంబంధించిన సుదీర్ఘమైన రిపోర్టు, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి పునర్ముద్రించబడింది. ఈ సంచికలో “పాళియంకోట ఇన్ 1810-1827" అనే ధారావాహిక కూడా ప్రచురించబడింది. ఈ ధారావాహిక పీపుల్స్ ఫ్రెండ్ లో చాలాకాలంగా ప్రచురించ బడుతున్నట్లుంది. ఈ సంచికలో 1826 సంఘటనలు వివరించబడ్డాయి. తిన్నెల్వేలి జిల్లాలోని పాళియంకోట కేంద్రంగా క్రైస్తవ మిషనరీల అనుభవాలు, మత ప్రచారం ఉత్తమపురుషలో వివరించబడ్డాయి. ఈ సంచికలోనే కడలూరు ప్రభుత్వ కళాశాల బహుమతి ప్రదానోత్సవం మీద సుదీర్ఘమైన నివేదిక ప్రచురించబడింది.

రెండో పుటలో “అవర్ కరస్పాండెన్సు” (Our correspondence) శీర్షికలో రెండు