పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు

63


ఉన్నాయి. ఆ పుస్తకంలో ఉద్యోగుల నియామకాలు, జీతబత్యాలు, విధులు, ఇంక్రిమెంట్లు, మెచ్చుకోళ్ళు, జుల్మానాలు అన్నీ రాసి ఉంచాడు. ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు, ప్రెస్‌కార్మికులు అని రెండురకాలుగా ఉండేవారు. ఆఫీసు అజమాయిషీ హెడ్‌క్లర్కు బాధ్యత. అతని కింద మొదటి గుమాస్తా, రెండవ గుమాస్తా అని వరుసగా ఐదుమంది గుమాస్తాలుండేవారు. అందరి విధులు ఆఫీసు ఆర్డరు పుస్తకంలో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. పత్రిక శనివారం సాయంత్రం విడుదలౌతుంది కనుక ఐదుగురు కంపాజిటర్లు శుక్రవారం రాత్రంతా పనిచేసేవారు. శనివారం ఉదయం పదిగంటలకల్లా నాలుగోఫారం అచ్చుపూర్తయి, పత్రిక విడుదలకు సిద్ధమవుతుంది. ఉద్యోగులందరూ కలిసి సాయంత్రంలోపల డిస్పాచ్ పూర్తిచేసి ఇళ్ళకు వెళ్తారు.

పీపుల్స్ ఫ్రెండ్ ప్రెస్‌కు అనుబంధంగా ఒక లైబ్రరి, దాని వ్యవహారాలు చూచుకోడానికి లైబ్రేరియన్ ఉండేవాడు. పుస్తకాలకు కేటలాగులు తయారుచేయడంతో పాటుగా, పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ పేరుతో నరసయ్య నిర్వహించిన పుస్తక విక్రయసంస్థ పనులు కూడా ఈ లైబ్రేరియన్ చూచుకొనేవాడు. ప్రెస్ డిపార్ట్‌మెంట్‌లో ఒక సూపర్నెంటు ఉండేవాడు. ఇతనికి ప్రూఫులు చూడడం మొదలైన బాధ్యతలుండేవి. ఇతనికి సాయంగా ప్రూపురీడర్లు ఉండేవారు. కంపాజిటర్ల పనులు అజమాయిషీ చెయ్యడం, ప్రూఫులుచూడడం వంటి పనులు వీరు చూచుకొనేవారు. ఎన్.సి. శ్రీనివాసాచారి కొంతకాలం సూపర్నెంటుగా పనిచేశాడు. ఇతణ్ణి గురించి నరసయ్య ఆర్డరుబుక్‌లో ఈ విధంగా రాశాడు. "N.C. Srinivasachari, who in consideration of his possessing some knowledge of 4 languages viz. English, Telugu, Tamil and Sanskrit appears to be much better fitted to supervise the printing business of various kinds in this office, whose salary will ( at ) present be Rs 9 (Nine) a month". (office order 12 dated 8-1-1882) తెలుగు, తమిళ, గ్రంథ వెర్నాక్యులర్ ఫోర్మన్ (Vernacular Foreman) రాజగోపాల్ నెలజీతం 9 రూపాయలు. ఇతని పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని, నరసయ్య రోజూ 5 1/2 అణాల జీతం ఏర్పాటు చేశాడు. పేపర్‌బాయిస్, చందా వసూలు చేసే ఉద్యోగులు వగైరా చిల్లర ఉద్యోగులు కొందరు. వీరిలో 'బుల్లర్' (Buller) అనే ఒక చిన్న ఉద్యోగి ఉండేవాడు. ఇతని జీతం నెలకు మూడు రూపాయలు. పనివారు చేసే తప్పులను నరసయ్య ఆఫీసు ఆర్డరు ద్వారా వారి దృష్టికి తీసుకొని వచ్చేవాడు. వారిని మందలించి సరిదిద్దడానికి ప్రయత్నించడం, జరిమానా విధించడం, ఒకపూట జీతం కోతపెట్టడం, చివరకు మారడని తోచినప్పుడు విధులనుంచి తొలగించడం, ఉద్యోగి ప్రాధేయపడితే క్షమించి మళ్ళీ పనిలో చేర్చుకోడం ఆయన అనుసరించిన ఆఫీసు పరిపాలనా పద్దతి. క్రమశిక్షణతో పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహిస్తూ ఆఫీసుఆర్డర్లు రాశాడు. అటువంటి వారికి జీతం వృద్ధి చేయడం కనిపిస్తుంది. విశ్వనాథయ్య ఎఫ్.ఏ పాసైన సంగతి తెలిసి,