పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

దంపూరు నరసయ్య


ఫ్రెండ్ లైబ్రరి' పేర పుస్తక విక్రయం కొనసాగించాడు. ప్రభుత్వ చట్టాలు, రెగ్యులేషన్స్‌కు సంబంధించిన పుస్తకాలు, తెలుగు తమిళ ప్రాచీనకావ్యాలు, సాహిత్యగ్రంథాలు, బ్రహ్మసమాజ గ్రంథాలు, పాఠ్యపుస్తకాలు, గైడ్లు, పాత పాఠ్యపుస్తకాలు, రఘునాథరావు ఇతర సంస్కరణవాదుల గ్రంథాలు, పీపుల్స్ ఫ్రెండ్ లైబ్రరీ ద్వారా విక్రయంఅయ్యేవి. నరసయ్య రచించిన “ఎసన్షియల్స్ ఆర్ ఫస్ట్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ ఈజీ తెలుగు (Essentials or a First book of English Grammar in Easy Telugu) ఈ సంస్థ విక్రయించే పుస్తకాల జాబితాలో ఉంది. ఇది వ్యావహారికభాషలో రాయబడిన తొలి తెలుగు పాఠ్యపుస్తకాలలో ఒకటి కావచ్చు.

టైమ్స్ ఆఫ్ ఇండియా (Times of India), స్టేట్స్‌మన్ (Statesman), హిందూ (Hindu) మొదలైన పత్రికలలో ప్రచురించబడిన వార్తలు పీపుల్స్ ఫ్రెండ్‌లో ధారాళంగా పునర్ముద్రణ పొందాయి. ఆనాటి భారతీయ పత్రికలు, ముఖ్యంగా చిన్నపత్రికలు సోదర పత్రికల నుంచి, విదేశీపత్రికల నుంచి వార్తలు సేకరించి ప్రచురించేవి. ఆంగ్లో ఇండియన్ పత్రికలు కూడా ఈ పద్ధతినే అనుసరించేవి. ఒక్క మెయిల్ పత్రికకు తప్ప మద్రాసు నుంచి వెలువడే ఇతర పత్రికలకు వేటికి న్యూస్ సర్వీసు (News Service) సౌకర్యం ఉండేది కాదు. విద్యావంతులైన స్థానికులు రాసిన వార్తలు, వ్యాసాలు, లేఖలు అన్ని పత్రికలూ ప్రచురించేవి. ఈ పత్రికలకు ప్రత్యేకంగా విలేకరులు ఉండేవారు కాదు.

పీపుల్స్ ఫ్రెండ్ మూడోపుటలో అక్నాలెడ్జిమెంటు (Acknowledgement) శీర్షికలో ఆ వారం కొత్తగా చందాదారులైన వారి పేర్లు కనిపిస్తాయి. 1883 డిసెంబరు 1 సంచికలో షుమారు 32 మంది కొత్తగా చందారులైనవారి పేర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, కోయిలకుంట్ల, పుంగనూరు నుంచి ముగ్గురు చందాదారులయ్యారు. వారిలో ఒకరు ముస్లిం. మిగిలిన చందాదారులు దాదాపుగా తమిళదేశానికి సంబంధించినవారు. ఒకరో ఇద్దరో కేరళవాసులు.

1888 ఫిబ్రవరి 25 సంచికలో 15మంది గ్రామీణ ప్రాంతాల నుంచి చందాలు పంపిన వారి పేర్లున్నాయి. నెల్లూరుజిల్లా ఇందుకూరుపేటనుంచి ఒకరు, ఒంగోలు, అనంతపురం, భద్రాచలం, సికిందరాబాదు, ఒరిస్సా, కేరళ ప్రాంతాలనుంచి ఒక్కొక్కరు ఉన్నారు. మిగతావారు తమిళ గ్రామీణ ప్రాంతాలవారు. వీళ్ళలో కొద్దిమంది ముస్లిమ్‌లు, క్రైస్తవులు కూడా ఉన్నారు.

1883 డిసంబరు 1 సంచిక

పీపుల్స్ ఫ్రెండ్స్ ప్రతిపుట నాలుగు 'కాలా'లుగా విభజించబడింది. మూడోపుట మొదటికాలంలో ప్రకటనలున్నాయి. ఆపుటలోనే చందాదారులను ఉద్దేశించి నరసయ్య చేసిన సుదీర్ఘమైన విన్నపం సంగ్రహానువాదం :