పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

దంపూరు నరసయ్య


రెండేళ్ళపాటు హిందువుల అభివృద్ధికి ఈ పత్రిక కృషి చేసింది.4 1843లో మద్రాసు మిషనరీలు నేటివ్ హెరాల్డు (Native Herald) పత్రిక ప్రారంభించి మత ప్రచారం సాగించారు.5 1844 లో గాజుల లక్ష్మీనరసుసెట్టి క్రెసెంట్ (Crescent) పత్రికను ప్రారంభించాడు. ప్రెసిడెన్సీలోని హిందువుల మనోభావాలు, ఆశలు ఈ పత్రిక పుటలలో వ్యక్తమయ్యేవి. పత్రిక ఆర్థికంగా నిలదొక్కుకోడానికి, లక్ష్మీనరసుపెట్టి మద్రాసు సంపన్నవర్గాల ప్రముఖులను భాగస్వాములుగా తీసుకొన్నాడు. ఈ పత్రిక షుమారు ఇరవై సంవత్సరాలు సమాజానికి ఉపయోగకరంగా కొనసాగి, మూతపడింది.6 క్రెసెంట్ నిలిచిపోయిన తర్వాత, దాని ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళడానికి హిందూ క్రానికల్ (Hindu Cronicle) ప్రారంభమైంది.7 కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె, ఆయనమిత్రులు, అనుచరులు సంఘసంస్కరణ కోసం, స్త్రీ విద్యకోసం కృషిచేశారు. ఎం. వెంకటరాయులునాయుడు 1853లో రైసింగ్ సన్ (Rising Sun) పత్రిక స్థాపించి, పదేళ్ళు నడిపాడు. ఈ పత్రిక నిలిచిపోయిన తర్వాత, 1860 దశాబ్దంలో నేటివ్ అడ్వొకేట్ ఆరంభమైందని, సుందరలింగం రాశాడు.8 1845 లో ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్ (Athenaeum and Daily News) పత్రిక ప్రారంభమైంది. "The barrister's father was a partner of Pharoah and Co., who are also Publishers of the Athenaeum when it flourished under Mr. John Bruce Norton's editorship" అని నరసయ్య ఈ పత్రికను గురించి రాశాడు.9 ఈ పత్రిక యాజమాన్యం యూరోపియన్లదే అయినా, మద్రాసు ప్రజల జీవితాన్ని గురించి, హిందువుల సాంఘికసమస్యలను గురించి రాసింది. 1875 ప్రాంతాలలో ఈ పత్రిక కొనసాగుతున్నట్లు సూర్యాలోకం తెలియచేసింది.10

1858లో మద్రాస్ టైమ్స్ (Madras Times) ప్రారంభమైంది. ఇది యూరోపియన్లలో దిగువ వర్గాలవారి పత్రిక. చిన్న వ్యాపారులు, టీతోటల యజమానుల సమస్యలు ఇందులో చర్చించబడేవి.11 1865 ప్రాంతాలలో మద్రాస్ స్టాండర్డ్ (Madras Standard) పత్రిక వెలువడుతూంది. 1868 డిసంబరులో మద్రాస్ మెయిల్ (Madras Mail) తొలిసంచిక విడుదలైంది. యూరోపియన్లలో ఉన్నతవర్గాలవారి అభిరుచులకు, ఆలోచనలకు అనుగుణంగా ఈ పత్రిక సాగింది. ఇది ఛేంబర్ ఆఫ్ కామర్సు (Chamber of Commerce), యూరోపియన్ క్లబ్బులకు సంబంధించిన ఎగువతరగతి వర్గాలకు చెందిన పత్రిక. ఇంగ్లాండులో ముద్రించబడే మంచి పత్రికల బాణీలో నడిచింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈ పత్రికకు ఉన్నంతమంది చందాదారులు ఇంకే పత్రికకూ లేరు. స్పెక్టేటర్ (Spectator), మద్రాస్ టైమ్స్ ఇందులో లీనమయ్యా యి.12 1870 దశాబ్దిలో టి. మాధవరావు, ఆర్, రఘునాథరావు నేటివ్ పబ్లిక్ ఒపీనియన్ (Native Public Opinion), ఎ. రామచంద్రఅయ్యరు మదరాసీ (Madrassee) పత్రికలను ప్రారంభించారు. ఈ ముగ్గురు పాశ్చాత్య విద్యావిధానంలో విద్యార్థనచేసిన తొలితరం