పుట:English Journalismlo Toli Telugu Velugu Dampuru Narasayya.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

దంపూరు నరసయ్య


మార్చి 27వ తారీకునాడు కమిషనర్ల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టరు వేన్సు ఏగ్నూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించాడు. కోటయ్యసెట్టి, నరసయ్య కమిషనర్లహోదాలో సమావేశంలో పాల్గొన్నారు. జె. మెక్లిన్, కె. జగన్నాథంచెట్టియారు, నరసయ్య ముగ్గురూ ఒక ఉపసంఘంగా ఏర్పడి, నెల్లూరు టౌన్‌లో ప్రాథమిక పాఠశాలల విస్తరణకోసం తయారుచేసిన నివేదికమీద ఈ సమావేశంలో చర్చ జరిగింది.20 అటుతర్వాత ఎన్నడూ నరసయ్య నెల్లూరు మునిసిపాలిటి పాలకమండలి సమావేశాలలో పాల్గొన్నట్లు గెజిటులో రిపోర్టు కాలేదు.

నెల్లూరు జిల్లా లోకల్‌ఫండ్ బోర్డు సమావేశాలు

నెల్లూరు జిల్లా లోకల్‌ఫండ్ బోర్డు సమావేశాల్లో డెప్యూటి స్కూల్ ఇన్‌స్పెక్టర్ల హోదాలో కోటయ్యసెట్టి, నరసయ్య పాల్గొంటూ వచ్చారు. కోటయ్యసెట్టి నెల్లూరు రేంజి విద్యాధికారి, నరసయ్య ఒంగోలు రేంజి విద్యాధికారి. 1872 ఏప్రిల్ మాసంలో జరిగిన బోర్డు సమావేశంలో నరసయ్య మొదటిసారి పాల్గొన్నాడు.21 కోటయ్యసెట్టి, నరసయ్య నెల్లూరు జిల్లాలో పాఠ్యపుస్తకాల పంపిణిలో తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ, రాసిన లేఖలను సమావేశంలో చర్చించారు. ఇన్‌స్పెక్టింగ్ మాస్టర్లకు అలవెన్సు కొనసాగించాలని వీరు చేసిన ప్రతిపాదనను బోర్డు సభ్యులు ఆమోదించారు.

1872 అక్టోబరునెలలో జరిగిన బోర్డుసమావేశంలో ఉత్తమవిద్యార్థులకు బహుమతులిచ్చి ప్రోత్సహించాలని నరసయ్య ప్రతిపాదించి, అందుకోసం అవసరమైన పుస్తకాలజాబితా తయారు చేసి సభ్యుల ముందుంచాడు. ఈ ప్రతిపాదనల మీద చర్చ జరిగింది. తరగతిలో పదిమంది కన్న తక్కువ విద్యార్థులున్నపుడు ఒక బహుమతి చాలని, అంతకు మించి విద్యార్థులున్నపుడు రెండు బహుమతులివ్వవచ్చని సభ్యులు తీర్మానించారు. ప్రతి పాఠశాలలోనూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యే ఒక విద్యార్థికి బహుమతి ఇవ్వాలని నరసయ్యచేసిన, ప్రతిపాదనకూడా సభ్యుల ఆమోదం పొందింది.22

1873 మే 12వ తారీకున జరిగిన బోర్డుసమావేశంలో ఒంగోలుడివిజను పాఠశాలల్లో, కింది తరగతుల్లో అనుసరించబడుతున్న పాఠ్యాంశాలమీద నరసయ్య ఒక నివేదికను తయారుచేసి, సమర్పించాడు. యూనియన్ స్కూళ్ళ నిర్వహణలో, ఇన్‌స్పెక్టింగ్ మాస్టర్ల విధులకు సంబంధించిన కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టాలని కోరాడు.23 1874 మే 8న జరిగిన బోర్డు సమావేశానికి, కోటయ్యసెట్టి, నరసయ్య హాజరయ్యారు. ఉదయగిరిలో ఒక ఆంగ్లో వర్నాక్యులర్ పాఠశాల ప్రారంభించమని అభ్యర్థిస్తూ, అక్కడి తాసిల్దారు నరసయ్యకు ఒక ప్రతిపాదన పంపాడు. ఇదే విషయంమీద అక్కడి ప్రజలు నరసయ్యకు ఒక అర్జీ ఇచ్చారు. ప్రజల కోరికను మన్నించి, ఉదయగిరిలో స్కూలు నెలకొల్పి, హిందుస్థానీ, తెలుగు, ఇంగ్లీషు